టీఆర్ఎస్ పార్టీకి 2008 ఉపఎన్నికల్లో పట్టినగతే పడుతుందని మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 18 స్థానాలకు 2008 లో రాజీనామా చేసిన టీఆర్ఎస్ పార్టీ ఉపఎన్నికలకు వెళ్లగా కేవలం 7 సీట్లు మాత్రమే సాధించిందన్నారు. ఇలా అప్పుడు వ్యతిరేకించినట్లే ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజానికం టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.

శుక్రవారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... అకారణంగా అసెంబ్లీని రద్దు చేసినందుకు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరిగిపోయిందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండానే మళ్లీ ఎన్నికలకు వెళ్ళడమంటే కేసీఆర్ తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లేనని అన్నారు. కేవలం ఈ ప్రభుత్వ హయాంలో 14వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయని, దీనిపై నిరుద్యోగులకు కేసీఆర్ సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

కమీషన్ల కోసమే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు చేపట్టారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ కమీషన్ల ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి కేవలం ఇరవై నుండి ముప్పై సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు.