హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీ తొత్తు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మరోసారి టీఆర్ఎస్ కి ఓటేసి మోసపోవద్దని హితవు పలికారు. 

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగదన్నారు. తనకు అధిష్టానం ఏపని అప్పజెప్పినా చిత్తశుద్దితో పని చేస్తానని చెప్పుకొచ్చారు. తనపై నమ్మకంతో ప్రచారకమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. 

తెలంగాణలో   అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మాయమాటలు చెప్పి గెలుపొందారని ఈసారి ప్రజలు మోసపోరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 

టీఆర్ఎస్ దొడ్డిదారిలో వచ్చి, ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ది జరగడంలేదనే బాధ తనను వేధిస్తోందన్నారు. ఇలాగే ఉంటే భవిష్యత్తులో ప్రజలు చాలా నష్టపోతారని ఆ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. 

కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోనైనా ప్రజలు మేల్కోవాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్‌లో ఒక్క అభ్యర్థి గెలిచినా అది బీజేపీకి మద్దతు ఇచ్చినట్టేనని ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్, ఎలక్షన్ కమిషనర్ ముగ్గురూ ఒకటేనని ఆమె విమర్శించారు. 

సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అడ్డదారిలో వెళ్లి గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. అందుకు నిదర్శనమే టీఆర్ఎస్ 16 స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్న ధీమాయే నిదర్శనమని విజయశాంతి స్పష్టం చేశారు.