మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై స్పందించారు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి. డబ్బు, మద్యంతో మునుగోడు ఉపఎన్నిక జరిగిందన్నారు. ప్రజలు ఏనాటికైనా మరలా కాంగ్రెస్ పార్టీనే ఆదరిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

డబ్బు, మద్యంతో మునుగోడు ఉపఎన్నిక జరిగిందన్నారు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి. ఉపఎన్నిక కౌంటింగ్ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ, తాను చేసిన పోరాటంలో నైతిక విజయం తనదేనని స్రవంతి అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఇలాంటి ఓటమి ఎదురైనా గానీ.. ప్రజలు ఏనాటికైనా మరలా కాంగ్రెస్ పార్టీనే ఆదరిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

అంతకుముందు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసి తనను ప్రచారం కూడా చేయనివ్వలేదని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ అధర్మంగా గెలిచినట్టేనని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం వెలుపల రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భారత దేశ చరిత్రలో ఎన్నికల మధ్యలో రిటర్నింగ్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేయడం మొట్టమొదటి సారిగా మునుగోడులోనే జరిగిందన్నారు. 

కేసీఆర్, కేటీఆర్‌లు ఒత్తిడి తీసుకొచ్చి రిటర్నింగ్ అధికారితో తప్పులు చేయిస్తే.. ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు. పోలీసులు ఏక పక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. నవంబర్ 3వ తేదీ సాయంత్రం వరకు బయటి ప్రాంతాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు మునుగోడులోనే ఉండి.. ఓటర్లను ప్రలోభ పెట్టినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. మునుగోడులో కేసీఆర్ అవినీతి సొమ్ముతో మద్యం ఏరులై పారించారని విమర్శించారు.పోలీసు వ్యవస్థను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ అడ్డదారుల్లో అధర్మంగా గెలించిందని విమర్శించారు. 

ALso REad:మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు.. పోరాడి ఓడిన బీజేపీ, చేతులెత్తేసిన కాంగ్రెస్

అక్టోబర్ 31వ తేదీ వరకు మునుగోడులో బీజేపీ ముందంజలో ఉందన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి నవంబర్ 1వ తేదీన కూడా బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు మునుగోడులోనే ఉండి.. డబ్బులు పంచి, బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. తెలంగాణలో నియంత పాలనకు చరమగీతం పాడాలంటే మోదీ, అమిత్ షాలతోనే సాధ్యం అని మునుగోడు ప్రజలు నిరూపించారని.. కానీ ప్రలోభాలతో టీఆర్ఎస్ కొద్దిపాటి మెజారిటీతో గెలిచిందని విమర్శించారు.

కాగా... ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 47 మందిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.