హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెను రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.రాజకీయంగా అధికార టీఆర్ఎస్‌కు ఈ సమ్మె విషయంలో నష్టం కల్గించేవిధంగా పావులు కదుపుతున్నాయి.

తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీలోపుగా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులంతా సెల్ప్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో చర్చించాలని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆర్టీసీ జేఎసీ కూడ సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వథామరెడ్డి సానుకూలంగా స్పందించారు.

కానీ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పరిణామం ఆర్టీసీ కార్మికులను అసంతృప్తికి గురిచేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు విపక్షాలు మద్దతుగా నిలిచాయి. ఈ నెల 19న తలపెట్టిన  ఆర్టీసీ బంద్ కు విపక్షాలు మద్దతుగా నిలిచాయి.

ఆర్టీసీ సమ్మె విషయంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ నెల 21 హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఆర్టీసీ సమ్మె రాజకీయంగా తమకు ప్రయోజనం కల్గిస్తోందనే అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది.

అయితే హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ డిపో లేదు. దీంతో సమ్మె ప్రభావం ఎన్నికలపై ఏ మాత్రం చూపదని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. మరో వైపు ఇతర ఉద్యోగ సంఘాలు కూడ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలవడం కూడ కాంగ్రెస్ లో ఆశలను కల్పిస్తోంది.అంతేకాదు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ తన మద్దతును ఉప సంహరించుకొంది.

ఈ ఎన్నికల్లో సీపీఐ ఎవరికి మద్దతు ప్రకటిస్తోందనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతివ్వనుందా... మరో అభ్యర్ధికి సపోర్ట్ చేస్తోందా లేదా ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వకుండా తటస్థంగా ఉంటుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయమై సీపీఐ తన వైఖరిని ప్రకటించనుంది.

ఇదిలా ఉంటే తెలంగాణలో బలపడేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకొంది.ఈ పరిణామం బీజేపీ నాయకత్వంలో మరిన్ని ఆశలను రేకేత్తించింది. 

తెలంగాణ రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం కూడ మరింతగా కేంద్రీకరించింది. ఆర్టీసీ సమ్మెను ఆసరాగా చేసుకొని బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.  

ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందరరాజన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది. మంగళవారం నాడు సాయంత్రం రెండో దఫా కూడ గవర్నర్ తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీ భూముల లీజుల విషయంలో గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలోనే ఆర్టీసీ జేఎసీ నేతలు కూడ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం చర్చించాలని కోరారు. ఇదే సమయంలో గవర్నర్ సౌందరరాజన్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటన ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఆర్టీసీ సమ్మె వెనుక తమ పార్టీకి చెందినవారున్నారని  జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక టీఆర్ఎస్ లో అంతర్గతంగా ఏదో జరుగుతోందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిణామాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేస్తోందనే ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ కు చెందిన కొందరు కీలక నేతలతో బీజేపీ టచ్ లో ఉందనే ప్రచారం సాగుతోంది.ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను టీఆర్ఎస్ పై ప్రయోగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

ఆర్టీసీ సమ్మె విషయంలో కేశవరావు చేసిన ప్రకటన కూడ ఇందులో భాగమేననే  ప్రచారం కూడ లేకపోలేదు. కేశవరావు రాజ్యసభ పదవీకాలం  త్వరలోనే ముగియనుంది. కేశవరావుకు ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ అపాయింట్ మెంట్ లభ్యం కాకపోవడం చర్చకు దారి తీసింది.మరో వైపు కేశవరావు ఖమ్మం వెళ్లడం కూడ చర్చకు దారితీసింది.

ఆర్టీసీ సమ్మె వెనుక కొందరు ఉన్నారని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.ఈ పరిణామంతోనే కేసీఆర్ కేశవరావు ప్రతిపాదనకు అంగీకరించలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. ఆర్టీసీ సమ్మెను రాజకీయంగా తమకు అనుకూలంగా వాడుకొనేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే ఎవరికి ప్రయోజనం కలుగుతోందో త్వరలోనే తేలనుంది.