ఎక్కడ ఏ నలుగురు కలిసినా ప్ర‌తి ఒక్క‌రు చ‌ర్చించుకుంటున్న విష‌యం ఇదే. టీఆర్ఎస్ గెలుస్తుంద‌ని కొంద‌రు.. మ‌హాకూట‌మిదే గెలుపు అని మ‌రికొంద‌రు.. అయితే అంతిమంగా గెలుపు ఎవ‌రిద‌నేది నిర్ణ‌యించాల్సింది తెలంగాణ ఓట‌ర్లే.. తెలంగాణ ఓట‌ర్ల తీర్పు ఏంట‌నేది మరికొద్ది గంటల్లో తెలుస్తోంది. కానీ తెలంగాణ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై అందిరిలో ఆస‌క్తి రోజు రోజుకు పెరిగిపోతుంది. 

జాతీయ మీడియా సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో టీఆర్ఎస్‌దే హవా అని తేలింది. అయిందే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టంగా తెలిపారు. ఇవేవి కాకుండా ఒకవేళ ‘‘హంగ్’’ వస్తే పరిస్ధితి ఏంటనే కోణంలోనూ కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. 

కర్ణాటకలో ఎదురైన పరిస్థితి ఇక్కడ ఎదురుకాకూడదనే ఉద్దేశ్యంతో ట్రబుల్ షూటర్లను రంగంలోకి దించింది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో కీలకపాత్ర పోషించిన ఆ రాష్ట్ర సీనియర్ నేత డీకే శివకుమార్‌తో పాటు జాతీయ నేత గులామ్ నబీ ఆజాద్‌లు హైదరాబాద్‌లో మకాం వేశారు. 

ఫలితం తారుమారైన పక్షంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా వీరిద్దరూ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. స్వతంత్ర అభ్యర్థులు, రెబల్ అభ్యర్థులను ప్రజాకూటమి వైపు తీసుకొచ్చేందుకు వీలుగా వారిద్దరు పావులు కదుపుతున్నారు. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేత గూడురు నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఒకవేళ మేజిక్ ఫిగర్‌కు దూరంగా తాము ఆగిపోయిన పక్షంలో ఎంఐఎంతో సహా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమన్నారు. ఒకవేళ ఎంఐఎం మమ్మల్ని సంప్రదిస్తే ఆహ్వానిస్తామన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు కర్ణాటక రాజకీయ పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 

రెండు పార్టీలు ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంపు రాజకీయాలకు తెర లేపేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తుది ఫలితం ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొద్ది గంటలు వేచి చూడాల్సిందే.