ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. ఆయన ట్రాక్ రికార్డు కూడా బాగుంది. ఎమ్మెల్యేగా గెలిచిన కాబట్టి.. అడ్డదిడ్డంగా సంపాదించుకోవాలన్న యావ ఆయనకు లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేను అన్న అహం చూపిన దాఖలాలు లేవు. అయినా ఆయనకు నియోజకవర్గంలోనే రైతులు షాక్ ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం కింద వార్తను చదవండి.. వీడియోనను చూడండి.

పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి తన నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. పంటసాగు కోసం నీరు విడుద‌ల చేస్తామ‌ని మాట ఇచ్చి, జాప్యం చేస్తున్నారని రైతులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై త‌మ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా గుడిలో పూజ‌లు చేయ‌డానికి గంగారం గ్రామానికి వచ్చారు ఎమ్మెల్యే. దీంతో గ్రామ రైతులు మార్గ‌మ‌ధ్యంలోనే అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అందిస్తాన‌ని చెప్పిన సాగునీరు ఇంకా విడుద‌ల చేయ‌క‌పోవ‌డంపై ఆయ‌న‌ను నిల‌దీశారు.

ఎమ్మెల్యే మాట మీద న‌మ్మ‌కంతో పంట‌లు సాగు చేశామ‌ని, ఇప్పుడు నీరు లేక అవి ఎండిపోతున్నాయ‌ని వాపోయారు. ఎమ్మెల్యే స‌మాధానం చెప్ప‌కపోవ‌డంతో ఆయ‌న‌తో వాగ్వాదానికి దిగారు. సాగునీటిని కూడా ఇవ్వలేని నేతలు ఎందుకంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడి నుంచి నిష్క్రమించే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వాహనం వెనుక చాలా దూరం పరుగులు తీశారు. ఈ ఘటన తెలంగాణలో హాట్ టాపిక్ అయింది.