హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ పార్టీ నేతలను కోరారు. టీఆర్ఎస్‌ను కేడర్ బేస్ పార్టీగా తీర్చిదిద్దనున్నట్టుగా ఆయన తెలిపారు.

ఆదివారం నాడు  సభ్యత్వ నమోదు ఇంచార్జీలతో  కేటీఆర్ తెలంగాణ భవనంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేటీఆర్ తానే స్వయంగా కారు నడుపుకొంటూ వచ్చారు.  సుమారు రెండు గంటల పాటు  సభ్యత్వ నమోదు ఇంచార్జీలతో  కేటీఆర్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ ఏడాది జూలై 10వ తేదీ లోపుగా  సభ్యత్వాన్ని పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. సభ్యత్వ నమోదు పూర్తి కాగానే గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేయాలని  ఆయన సూచించారు.కమిటీల్లో 51 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాతినిథ్యం కల్పించాలని  కేటీఆర్ సూచించారు.

మున్సిఫల్ ఎన్నికలలోపుగానే  కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సోషల్ మీడియాను వినియోగించుకోవాలని ఆయన కోరారు. 30 శాతం క్రియాశీలక సభ్యత్వం ఉండాలని  కేటీఆర్  పార్టీ నేతలకు సూచించారు. సభ్యత్వ నమోదు డిజిటలైజేషన్  విభాగానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ను కేటీఆర్ ఇంచార్జీగా నియమించారు. 

ఇండిపెండెంట్ గా పనిచేసే మహిళలకు కమిటీల్లో ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. ఆగష్టు మొదటి వారంలో  మున్సిఫల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు.  ఎన్నికల లోపుగానే సంస్థాగత కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు.