హైదరాబాద్:విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వే షాక్ తగిలింది. ఎన్నికలకు ముందు సర్వే పేరిట ప్రకటనలు చేసి ఓటర్లను గందరగోళానికి గురిచేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టారని ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ నాయకుడు సత్తు వెంకటరమణా రెడ్డి ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

లగడపాటి రాజగోపాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సత్తువెంకటరమణారెడ్డి మంగళవారం రజత్‌కుమార్‌ ను కోరారు. ఎన్నికలకు ముందు ఎలాంటి సర్వే ఫలితాలు వెల్లడించవ్దదని ఎన్నికల కమిషన్‌ నింబధనలు ఉన్నప్పటికీ ఉల్లంఘించి ఎనిమిది నుంచి పది మంది ఇండిపెండెంట్లు గెలువబోతున్నారని లగడపాటి ప్రకటన చేశారని, తద్వారా ఓటర్లను ప్రలోభపెట్టడానికి మభ్యపెట్టడానికి అది దారి తీసిందని, ఇతర అభ్యర్థులపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన తన ఫిర్యాదులో  ఆరోపించారు.
 
 ఈ నెల 7న ఎన్నికలు ఉండగా 3వ తేదీన బోధ్‌లో జాదవ్‌ అనిల్‌కుమార్‌, నారాయణపేట్‌లో శివకుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్‌లో జలంధర్‌రెడ్డి, బెల్లంపల్లిలో జి.వినోద్‌ గెలుస్తారని ప్రసార, ప్రచార మాద్యమాల ద్వారా ప్రకటనలు చేశారని ఆయన గుర్తు చేశారు. మరో మూడు స్థానాల్లో తన సన్నిహితులు ఫలితాలు వెల్లడించవద్దని కోరారని అందుకే వీటిని ప్రకటించడం లేదని లగడపాటి చేసిన ప్రకటన మోసం, బెదిరింపులతో కూడినవని వెంటకరమణారెడ్డి  అన్నారు. 

ఈ నెల 11న ఓట్ల లెక్కింపు తర్వాత లగడపాటి ప్రకటించిన వారిలో ఓ ఒక్కరు గెలువలేదని, అంటే లగడపాటి ప్రకటన బ్లాక్‌ మెయిలింగ్‌ వంటిదని అర్థమవుతోందని ఆయన అన్నారు. రాజగోపాల్‌ కుట్రపూరితంగా సర్వే పేరిట డ్రామాకు తెరతీశారని ఆయన ఆరోపించారు.