హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావుకు బెదిరింపులు వస్తున్నాయి. ఈ విషయంపై ఆయన హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనకు ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. 

రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తామంటూ తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని విహెచ్ తన ఫిర్యాదులో చెప్పారు. తనను అసభ్యకరంగా దూషించారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై ఆయన శుక్రవారం ఉదయం తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Also Read: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి: విహెచ్ తిరుగుబాటు వెనక అదే.

రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పదవి ఇస్తే తాను పార్టీలో ఉండబోనని విహెచ్ అన్నారు. తనతో పాటు ఇతర నాయకులు కూడా వారి దారి వారు చూసుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 

రేవంత్ రెడ్డికే కాదు తనకు కూడా ప్రజల్లో క్రేజ్ ఉందని చెప్పారు రాష్ట్రంలో బిజెపి పుంజుకుంటున్న స్థితిలో ఆర్ఎస్ఎస్ వ్యక్తికి పిసీసీ పదవి ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు ఆర్ఎస్ఎస్ వ్యక్తి కింద తాను పనిచేయబోనని చెప్పారు.

రేవంత్ రెడ్డికి అన్ని డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని తాను సీబీఐకి లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. రెడ్లకే పీసీసీ పదవి ఇవ్వాలని అనుకుంటే ఒరిజినల్ రెడ్డికి ఇవ్వాలని ఆయన అన్నారు.