జనవరి 1న నూతనంగా ఏర్పడిన తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన టిబి రాధాకృష్ణను బదిలీ  చేస్తూ సుప్రీంకోర్టు కొలిజియం నిర్ణయం తీసుకుంది. అతన్ని కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించాలని  సిపారసు చేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. 

ఇటీవల జనవరి 1వ తేదీన ఉమ్మడి హైకోర్టు విభజన జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అప్పటి ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నిమమించి ఏపి హైకోర్టును నూతన న్యాయమూర్తిని నియమించారు. ఇలా సుప్రీంకోర్టు కొలిజియం  ద్వారానే నియమితులైన రాధాకృష్ణన్ కేవలం 12 రోజుల వ్యవధిలోని ఆకస్మికంగా బదిలీకావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 

అయితే ఇందులో ఎలాంటి ప్రాధాన్యత లేదని..తరుచూ జరిగే బదిలీల్లో భాగంగానే రాధాకృష్ణన్ బదితీ కూడా జరిగిందని న్యాయ శాఖ తెలిపింది. కోల్‌కతా హైకోర్టు చీఫ్ జస్టిస్డీకే గుప్తా డిసెంబరు 31వ తేదీన పదవీ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీని రాధాకృష్ణన్‌తో భర్తీ చేసినట్లు తెలుస్తోంది.  సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ సిక్రీ, జస్టిస్ బొబ్డే, జస్టిస్ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన  కొలిజియం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించేది ఇంకా వెల్లడించలేదు. 

గత ఏడాది జూలై నుండి ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాధాకృష్ణన్ వ్యవహరిస్తున్నారు. ఇటీవలే జనవరి 1న తెలంగాణ చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అయితే కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.