మెదక్ జిల్లా పాపన్న పేటలో అత్యుత్సాహం ప్రదర్శించారు కో ఆపరేటివ్ బ్యాంక్ అధికారులు. బ్యాంక్‌లో రుణాలు తీసుకుని వాటిని చెల్లించని రైతుల పేర్లను ఫోటోలతో సహా వూరంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

బ్యాంక్ అధికారుల తీరుతో మండిపడుతున్నారు రైతులు. పేర్లు, ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పు తీర్చడానికి తమకు కొంత సమయం కావాలని కోరుతున్నారు. 

పాపన్నపేట మండలంలో వ్యవసాయ పైపులైన్లు, గేదెలు, కోళ్ల ఫారాల ఏర్పాటు కోసం కొందరు రైతులు లాంగ్ టర్మ్ రుణాలు తీసుకున్నారు. ఇటీవల బకాయిలు తీర్చాలంటూ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధికారులు రైతులపై ఒత్తిడి తీసుకొచ్చారు.  

గతేడాది కరోనా, భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయిందని, ఈ పరిస్థితుల్లో తమ పరువు తీసి బజారుకీడ్చడం ఎంతవరకు సమంజసమని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.