హైదరాబాద్‌‌లోని జేబీఎస్-ఎంజీబీస్ మెట్రో రైలు కారిడార్‌కు కమీషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మార్గంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఎల్&టీకి చెందిన సీనియర్ ఇంజనీర్లు తదితరులు తనిఖీలు నిర్వహించారు. 

18 రకాల భద్రతా తనిఖీలు ప్రధానంగా విద్యుత్, అగ్నిమాపక, భద్రత, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ట్రాక్స్‌పై నిర్వహించారు. అనంతరం మెట్రో రైల్ సేఫ్టీ కమీషనర్ జేకేకే గార్గ్ క్లియరెన్స్ ఇచ్చారు.

ఇప్పటికే నాగోల్ నుంచి రాయదుర్గం వరకు కారిడార్-3తో పాటు ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు కారిడార్-1 అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసింది. దీనికి అదనంగా 11 కిలోమీటర్లు జోడించనున్నారు.

పదహారు నిమిషాల్లో 11 కిలోమీటర్లు చేరుకునేలా ఈ మార్గంలో ప్రయాణం కొనసాగనున్నది. ఈ మార్గంలో పరేడ్‌గ్రౌండ్స్ వద్ద కారిడార్-3కి, ఎంజీబీఎస్ వద్ద కారిడార్-1కి కనెక్ట్ అవుతుంది.

ఈ కారిడార్‌లో పరేడ్‌గ్రౌండ్‌, సికింద్రాబాద్‌ వెస్ట్‌, గాంధీ దవాఖాన, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్‌, ఎంజీబీఎస్‌ ఉన్నాయి. అతిపెద్ద ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌గా ఎంజీబీఎస్ నిలవనుంది.