యూపీఎస్సీ చైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై చర్చ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన పై సుధీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ)ను ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనితో శుక్రవారం భేటీ అయ్యారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ భేటీలో యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీని బలోపేతం చేసేందుకు సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
పారదర్శకమైన నియామక ప్రక్రియ కోసం యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీని పునర్ వ్యవస్థీకరించడంపై యూపీఎస్సీ చీఫ్ తో చర్చిస్తామని గురువారం ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. గతంలో టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పలు ఉద్యోగాల భర్తీలో ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడతామన్నారు. యూపీఎస్‌సీ తరహాలో టీఎస్‌పీఎస్‌సీని రూపొందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
2023లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన నియామక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ అయ్యాయి. ఈ పరిణామం రాష్ట్రాన్ని కుదిపేసింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు వరుస ఆందోళనలు నిర్వహించాయి. నిరుద్యోగులు కూడా టీఎస్ పీఎస్సీ తీరును తప్పుపట్టారు. ఈ బోర్డుపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొంత కాలం తరువాత రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన చేసి, దాని ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే తదనంతర పరిణామాల్లో టీఎస్ పీఎస్సీ బోర్డు చైర్మన్, సభ్యులు రాజీనామా చేశారు. అయితే దానిని ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. గవర్నర్ ఆమోదం తరువాత ఆ బోర్డుకు కొత్త చైర్మన్, సభ్యుల నియామకం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ ను కలవడం ప్రధాన్యత సంతరించుకుంది.