ఓటుకు నోటు ఎమ్మెల్సీ అభ్యర్థికి కేబినెట్ ర్యాంక్ ... ఆ పదవులన్నీ రేవంత్ సన్నిహితులకే...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరున్న వేం నరేందర్ రెడ్డి, హార్కర్ వేణుగోపాల్ కు కీలక పదవులు దక్కాయి. ఈ ఇద్దరితో పాటు షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు ముఖ్యమంత్రి.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితులకు కీలక బాధ్యతలు దక్కుతున్నాయి. తాజాగా ప్రభుత్వ సలహాదారుల నియామకంలో రేవంత్ వర్గానిదే పైచేయిగా నిలిచింది... ఆయనతో సన్నిహితంగా కొనసాగే నాయకులకే ఈ పదవులు దక్కాయి.
రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి వ్యవహారాల సలహాదారుగా నియమితులయ్యారు. గతంలో రేవంత్ టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరిన సమయంలో నరేందర్ ఆయనవెంట నడిచారు. ఇక రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన వ్యవహారాలన్నీ వెనకుండి పర్యవేక్షించింది నరేందర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా చాలాకాలంగా తనవెంటే నడుస్తున్న నరేందర్ రెడ్డికి సీఎం రేవంత్ తన సలహాదారుగా నియమించుకున్నారు.
ఇక రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన మరో నేత హర్కర వేణుగోపాల్ కు కూడా ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. ఆయనను ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్ వ్యవహారాల్లో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించేందుకు నియమించారు.
Also Read KTR: "రేవంత్ కాంగ్రెస్ ఏక్ నాథ్ షిండే.."
కాంగ్రెస్ సీనియర్ మైనారిటీ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కూడా ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. ఆయనను ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ శాఖల సలహాదారుగా రేవంత్ సర్కార్ నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోసం తన కామారెడ్డి సీటును షబ్బీర్ త్యాగం చేసారు. సొంత నియోజకవర్గాన్ని వదిలి నిజామాబాద్ అర్భన్ నుండి పోటీచేసిన ఆయన ఓటమిపాలయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీలో మిగతా సీనియర్ల మాదిరిగా కాకుండా ముందునుండి రేవంత్ రెడ్డితో సఖ్యతగా వున్న షబ్బీర్ అలీ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ప్రభుత్వ సలహాదారుగా కీలక పదవి దక్కింది.
ప్రభుత్వ సలహాదారుల నియామకానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేసారు. సలహాదారులుగా నియమితులైన నరేందర్ రెడ్డి, వేణుగోపాల్, షబ్బీర్ అలీ లకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ కల్పించారు.
ఇదిలావుంటే రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన మల్లు రవికి దేశ రాజధాని న్యూడిల్లీలో తెలంగాణ వ్యవహారాలు చూసుకునే బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. డిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయనను నియమించింది రేవంత్ సర్కార్.