Asianet News TeluguAsianet News Telugu

నేనే ముఖ్యమంత్రిని.. నేనే హోం, విద్యా శాఖల మంత్రిని.. ఎనీ డౌట్..: రేవంత్ మాస్ రిప్లై

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడి మార్పు వుంటుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒకటి నిజమైతే మరోటి తప్పుడు ప్రచారమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు...

CM Revanth Reddy Given Clarity on Cabinet Expansion  AKP
Author
First Published Jun 27, 2024, 9:43 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని అధికార బిఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ ఓడించింది. ఇలా కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలపై నీళ్లుచల్లి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. కాంగ్రెస్ సీనియర్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటివారు సీఎం సీటును ఆశించినా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపడమే కాదు కేసీఆర్ ను ఢీ అంటే ఢీ అనేలా ఎదిరించిన రేవంత్ కే అవకాశం ఇచ్చింది. దీంతో అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ రేవంత్ పవర్ సెంటర్ గా మారిపోయారు. 

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు, ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు రేవంత్ చేతిలోనే వున్నాయి. అంతేకాదు కీలకమైన హోం, విద్యా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆండ్ అర్బన్ డెవలప్‌మెంట్,  వాణిజ్య పన్నులు,జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి శాఖలు కూడా ఆయనవద్దే వున్నాయి. దీంతో రేవంత్ చాలా పవర్ ఫుల్ గా మారారు... ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అంటేనే రేవంత్ అనే  పరిస్థితి వచ్చింది. దీంతో రేవంత్ పవర్స్ కట్ చేసే పనిలో కాంగ్రెస్ సీనియర్లు వున్నారని... అందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణ చేపట్టేలా కాంగ్రెస్ అదిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.   

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు దేశ రాజధానిలో వున్నారు. కాంగ్రెస్ పెద్దలతో వీరంతా వరుసగా సమావేశం అవుతున్నారు... ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నారు. తాజాగా సీఎం రేవంత్ ఒక్క మాటతో మంత్రివర్గ  విస్తరణ ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. 

సీఎం రేవంత్ ఏమన్నారంటే : 

కేబినెట్ లో కీలకమైన హోం, విద్యా శాఖలను సీఎం రేవంత్ తనవద్దే పెట్టుకున్నారు... మంత్రివర్గ విస్తరణ జరిగితే ఈ శాఖలు తమవేనంటూ ఇప్పటికే మంత్రివర్గంలో వున్నవారితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు ఆశతో వున్నారు. ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి నాయకులు కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి...విద్యావ్యవస్థ అస్థవ్యస్తంగా తయారయ్యిందని ఆరోపిస్తున్నారు. ఈ శాఖలను సీఎం తనవద్దే పెట్టుకోవడం వలనే ఈ పరిస్థితి వచ్చిందని... వెంటనే ఈ హోం, విద్యా శాఖ మంత్రులను నియమించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. 

ఇలా స్వపక్షంతో పాటు విపక్షాలు కూడా సీఎం రేవంత్ తనవద్దే కీలక శాఖలు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ శాఖలను వదులుకోడానికి రేవంత్ సిద్దంగాలేరు... ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపారాయన. ప్రస్తుతం తెలంగాణలో ఏ మంత్రిత్వ శాఖ ఖాళీగా లేదని... అన్ని శాఖలకు మంత్రులు వున్నారని రేవంత్ స్పష్టం చేసారు. హోం, విద్యా శాఖలకు ఫుల్ టైమ్ మంత్రిని తానేనని రేవంత్ అన్నారు. 

ప్రస్తుతం తనతో పాటు మిగతా మంత్రులంతా తమతమ శాఖలకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు పొందేందుకే డిల్లీకి వచ్చారని సీఎం రేవంత్ అన్నారు. బడ్జెట్ లో తెలంగాణకు అత్యధిక నిధులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని... అందుకోసమే కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం అవుతున్నామని తెలిపారు. అయితే కొందరు కావాలనే తమ డిల్లీ పర్యటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... మంత్రివర్గ విస్తరణ అంటూ ఏదేదో వార్తలు రాస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కొన్ని పార్టీలకు చెందిన మీడియా సంస్థలే ఈ ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

తెలంగాణ పిసిసి చీఫ్ పదవిపై రేవంత్ ఏమన్నారంటే..: 

మంత్రివర్గ విస్తరణ వార్తను కొట్టిపారేసిన సీఎం రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అధ్యక్షుడిగా తాను మూడేళ్లు పనిచేసాను... త్వరలోనే తన పదవికాలం ముగుస్తుందని రేవంత్ తెలిపారు. ప్రస్తుతం ఓవైపు పాలన మరోవైపు పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నాను... ఇకపై పాలనపైనే పూర్తి ద‌ృష్టి పెట్టాలనుకుంటున్నానని రేవంత్ తెలిపారు. అందువల్ల తన పదవికాలం ముగిసేలోపు తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిని నియమించాలని తమ పార్టీ పెద్దలను కోరినట్లు రేవంత్ తెలిపారు.  

రేవంత్ క్లారిటీ ఇచ్చేసారు కాబట్టి త్వరలోనే తెలంగాణకు కొత్త పిససి అధ్యక్షుడు రానున్నారు. అది ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొత్త పిసిసి అధ్యక్ష రేసులో కొన్నిపేర్లు వినిపిస్తున్నారు. వీరిలో ఒకరికే ఆ పదవి వరిస్తుందా లేక అనూహ్యంగా కొత్తముఖాలు తెరపైకి వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా సీఎం రేవంత్ నుండి పార్టీ పగ్గాలు లాక్కుని పవర్ తగ్గించామని కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారట.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios