Rythu Bandhu: రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా.. నిధులపై త్వరలో ప్రకటన
సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో రైతు భరోసాపై సమీక్షించారు. మంత్రులు తుమ్మల, దుద్దిళ్ల హాజరయ్యారు. రైతు భరోసా సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా కింద నిధులు విడుదల చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్: ఎన్నికల ప్రచారం మొదలు ఫలితాలు వెలువడిన తర్వాత కూడా రైతు బంధు నిధులు ఎప్పుడు రైతులకు అందుతాయి? అనే ప్రశ్నపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షం నుంచీ దీనిపై డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా సాధ్యాసాధ్యాలపై సచివాలయంలో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ముఖ్య అధికారులు హాజరయ్యారు.
రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ. 15 వేలు రైతు భరోసా పథకం కింద అందజేస్తామని, వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12 వేలు అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల క్యాంపెయిన్‌లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వరిని రూ. 500 బోనస్ ఇచ్చి మరీ కొంటామని ప్రకటించింది. ఈ హామీలు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీల్లో ముఖ్యమైనవి. నాట్ల సీజన్ మళ్లీ ప్రారంభం కాబోతుండటంతో పెట్టుబడి సాయం కోసం రైతులు ప్రభుత్వం నుంచి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read: TSPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి ఉన్నదని, నిధుల కొరత ఉన్నదని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా పథకం కింద డబ్బులు పంపిణీకి సాధ్య సాధ్యాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీలో సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలోనే రైతు భరోసా నిధుల పంపిణీకి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. మరో వారంలోపే నిధులను రైతులకు పెట్టుబడి సాయంగా అందించే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
రైతు బంధు నిధులను డిసెంబర్ 9వ తేదీనే విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల వేళ ప్రకటించారు. కానీ, అది ఆచరణ రూపం దాల్చలేదు. దీంతో డిసెంబర్ 9వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు దీన్ని ప్రశ్నించారు. రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు ఎదురుచూస్తున్నారని అన్నారు.