తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా కేసీఆర్.. కొద్దిసేపటి క్రితం యాదాద్రికి చేరుకున్నారు. అక్కడ ప్రెసిడెన్షియల్ సూట్ను, వీవీఐపీ కాటేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా కేసీఆర్.. కొద్దిసేపటి క్రితం యాదాద్రికి చేరుకున్నారు. అక్కడ ప్రెసిడెన్షియల్ సూట్ను, వీవీఐపీ కాటేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కేసీఆర్ పర్యటనలో మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యాదాద్రి ప్రధానాలయానికి ఉత్తరం దిశలోని మరో కొండపై 13.2 ఎకరాల విస్తీర్ణంలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను నిర్మించారు. సుమారు రూ.104 కోట్లతో వీటిని నిర్మించారు. ఆలయ మహాసంప్రోక్షణలో భాగంగా మార్చి 21 నుంచి మహాసుదర్శన యాగం నిర్వహించనుండగా.. 75 ఎకరాల విస్తీర్ణంలో యాగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.
అనంతరం ఆయన భువనగిరికి చేరుకుంటారు. భువనగిరి శివారులోని రాయగిరిలో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అక్కడే జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షిస్తారు. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభింస్తారు. సాయత్రం 4 గంటలకు రాయగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. సభ అనంతరం కేసీఆర్.. తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి జగదీష్‌రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా అధికారులు ఇప్పటికే సీఎం పర్యటనుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇక, శుక్రవారం జనగామలో పర్యటించిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. నేడు రాయగిరిలో నిర్వహించే సభలో కూడా మరోసారి కేంద్రాన్ని టార్గెట్‌గా చేసుకుని కేసీఆర్ విమర్శలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
