Asianet News TeluguAsianet News Telugu

BRS Manifesto: ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా.. 16 న బీఆర్ఎస్ మేనిఫెస్టో- మంత్రి హరీశ్ రావు 

BRS Manifesto: త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో మహిళలకు శుభవార్త వినిపిస్తామని ఆయన పేర్కొన్నారు.

CM KCR Will Announce Manifesto on October 16 KRJ
Author
First Published Oct 5, 2023, 1:59 AM IST

BRS Manifesto: ఓరుగల్లు వేదికగా అక్టోబర్‌ 16న జరిగే భారీ బహిరంగ సభలో కొత్త మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని, కొత్త మేనిఫెస్టో వస్తే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. చెప్పిందే చేయడం.. చేసేదే చెప్పడం సీఎం కేసీఆర్ కు అలవాటని, అక్టోబర్ 16న ఏం చెప్పబోతున్నారో అనేది వేచి చూడాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.

బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో రూ.34 కోట్ల వ్యయంతో నిర్మించనున్న150పడకల ఆసుపత్రి భవనంతో పాటు ఫైర్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, రుద్రసముద్రం వద్ద గోడౌన్, గుడిగండ్ల ,కర్ని గ్రామాల్లో 11 కెవి సబ్స్టేషన్, కృష్ణాలో ఆసుపత్రి భవన నిర్మాణం, కేజీబీవీ పాఠశాల నిర్మాణాలకు మంత్రి హరీష్ రావు మక్తల్ లోనే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… వెయ్యి రూపాయల పెన్షన్ 200 నుండి 2000, కళ్యాణ లక్ష్మీ పథకం రూ.50వేల నుండి లక్ష రూపాయలకు పెంచినట్టే.. రాబోయే రోజుల్లో కొత్త పథకాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

ఈ తరుణంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూ.. ఆరు గ్యారెంటీలు అంటున్నతెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన హామీలు అమలు చేయలేక బోర్లా పడిందని ఏద్దేవా చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే అమలు చేయలేని హామీలను తెలంగాణలో అమలు చేస్తామంటే ఎవరూ నమ్మతారని మండిపడ్డారు.  తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసిన దాఖలాలు లేవన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది చేస్తుందని.. చేసేదే చెబుతుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

 మరోవైపు ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ పార్లమెంటులో కేసీఆర్ ను పోగడడం తెలంగాణలో అడుగుపెట్టగానే తిట్టడం ఆయనకు అలవాటుగా మారిందని అన్నారు. 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కానీ బీజేపీ అధికారంలోకి వస్తే మోటార్ కు మీటర్, ఇంటికి బిల్లు తప్పదని హెచ్చరించారు. మీటర్లు కావాలో..? బిల్లు కావాలో..?  ఎరువుల కోసం రోడ్లు ఎక్కే పరిస్థితి కావాలో? 24 గంటల ఉచిత కరెంటు కావాలో? ప్రజలే ఆలోచించుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. 

స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ.. తన నియోజక వర్గ అభివృద్ధి కోసం పరితపిస్తుంటారన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజు కూడా నియోజకవర్గంలో ఏదో గ్రామంలో పని ఉందని అనుమతి తీసుకొని బయలుదేరుతారనీ, అలాంటి ఎమ్మెల్యే మీ దగ్గర ఉండటం వ‌ల్లే నేడు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు అందుతుందని అన్నారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి కంటే మంచి వ్యక్తి ఇంకెవరు దొరకరనీ, ఆయనను ఈ సారీ భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి హరీష్ రావు కోరారు.  

Follow Us:
Download App:
  • android
  • ios