Asianet News TeluguAsianet News Telugu

వాణీదేవి ఎంపిక... ఆ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

మహ‌బూబ్‌న‌గ‌ర్ - రంగారెడ్డి - హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా అనూహ్యంగా మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కుమార్తె సురభి వాణీదేవి పేరు తెరపైకి వచ్చింది. 

CM KCR Meeting With Minister and MLAs
Author
Hyderabad, First Published Feb 22, 2021, 10:00 AM IST

హైదరాబాద్: తెలంగాణలో ఖాళీఅయిన రెండు పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ - రంగారెడ్డి - హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అనూహ్యంగా మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కుమార్తె సురభి వాణీదేవి పేరు తెరపైకి వచ్చింది. ఫోటీకి పార్టీలోని పలువురు సీనియర్లు ఆసక్తి చూపినా స్వయంగా ముఖ్యంమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ఈమె పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. 
 
ఈ నేప‌థ్యంలో వాణీదేవి సోమవారం నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. అయితే ఈ నామినేషన్ కార్యక్రమం కంటే ముందు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ - రంగారెడ్డి - హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేల‌తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ స‌మావేశానికి వాణీదేవిని నాయకులకు పరిచయం చేయడంతో పాటు గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేల‌కు సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.  

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ - రంగారెడ్డి - హైద‌రాబాద్ స్థానంలో టీఆర్ఎస్ తరపున పోటీచేసే అభ్యర్థి ఎంపికపై గతకొంత కాలంగా ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు అవకాశం ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్‌ అభ్యర్థిని ప్రకటించారు. 

ఇప్పటికే వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించారు కేసీఆర్. దీనికి సంబంధించి బుధవారం ప్రగతి భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌ బీ ఫాం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి..  ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

వరంగల్- నల్గొండ- ఖమ్మం, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి- హైదరాబాద్‌ జిల్లాల పట్టాభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి,  ఎన్‌ రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. దీంతో ఇటీవల కేంద్రం ఆయా స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయొచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios