జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీల నేతలను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది.
జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీల నేతలను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో ఆయన భేటీ కానున్నారని సమాచారం. ఎన్డీయే వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేజ్రీవాల్‌తో కేసీఆర్ చర్చలు జరపనున్నారు. అయితే కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక, ఇటీవల ముంబై వెళ్లిన కేసీఆర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్‌తో జాతీయ రాజకీయాలపై చర్చించిన సంగతి తెలిసిందే.
మరికాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరు కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను సీఎం ఖరారు చేయనున్నారు. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై కేసీఆర్ ఈ సమావేశంలో మంత్రులు, అధికారులతో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది.
ఇక, బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేసీఆర్‌తో పాటు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. త్వరలోనే ఎన్డీయేతర సీఎం సమావేశం నిర్వహించనున్నట్టుగా మమతా బెనర్జీ చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు మాజీ ప్రధాని దేవేగౌడ నుంచి మద్దతు కూడా లభించిన సంగతి తెలిసిందే.
దేశాన్ని బాగుచేయడానికి జాతీయ రాజకీయాల్లో వెళ్లాల్సిన అవసరం ఉందని పదేపదే చెబుతున్న కేసీఆర్.. ఈ క్రమంలోనే బీజేపీ వ్యతిరేక మద్దతు ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పలు పార్టీల నేతలను కలిసి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన నేడు ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్‌తో చర్చలు జరపనున్నట్టుగా తెలుస్తోంది.
