మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. హోలీ పండగ రోజు ఎమ్మెల్యే ప్రవర్తన సీఎం కేసీఆర్ కు కోపం తెప్పించాయి. పార్టీ పరువు తీసే విధంగా ప్రవర్తించకూడదని ఎమ్మెల్యేను హెచ్చరించారు.
హైదరాబాద్ లోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఇందులో టీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను, ఆ పార్టీ నాయకులు చేసే ఆరోపణలను తిప్పి కొట్టాలని సూచించారు.
ఈ సమావేశం అనంతరం మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను సీఎం కేసీరా్ తన ఛాంబర్ కు పిలిపించుకున్నట్టు సమాచారం. హెలీ పండగ రోజు మందేస్తూ, చిందేసిన విషయంపై కేసీఆర్ ఆయనపై సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. హోలీ పండగ అందరూ చేసుకుంటారని, కానీ ఇలా బహిరంగంగా మద్యం పోస్తూ, డ్యాన్స్ లు చేయడం ఏంటని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పరువు తీసేలా ఎవరూ పని చేయకూడదని అన్నారు. ఇలా చేస్తే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తాయని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని అన్నారు. ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అన్నింటినీ చూస్తూ వదిలేస్తున్నామని తెలిపారు. అయితే ఇలాంటి పనులు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే టీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.
వరి ధాన్యం కొనుగోళ్లపై తీర్మాణాలు..
యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా కేంద్రమే కొనాలని చెబుతూ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లు తీర్మాణాలు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. 24వ తేదీన గ్రామ పంచాయతీల్లో, 26వ తేదీన మండల పరిషత్ లో, 30వ తేదీన జిల్లా పరిషత్ లలో ఈ తీర్మాణాలు చేయాలని టీఆర్ఎస్ నాయకులతో చెప్పారు. బియ్యాన్ని కాకుండా వడ్లను కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో మంగళవారం తెలంగాణ మంత్రులు, ఎంపీలు కేంద్ర ఆహార శాఖ మంత్రిని కలవనున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో దేశమంతా ఒకే విధానం అవలంభించాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పంజాబ్ లో సేకరించినట్టే, తెలంగాణలోనూ సేకరించాలని చెప్పారు. ఇది రైతులకు చాలా ముఖ్యమైనదని అన్నారు. రా రైస్ తీసుకుంటారా, బాయిల్డ్ రైస్ తీసుకుంటారా అనేది కేంద్రం నిర్ణయమే అని సీఎం కేసీఆర్ చెప్పారు. 30 లక్షల ఎకరాల్లో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
