హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం కేసీఆర్ తొలి సమీక్ష భారీ నీటి పారుదల ప్రాజెక్టులపై చేపట్టారు. నీటి పారుదల ప్రాజెక్టులపై  దాదాపు 7 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పనుల రిపోర్టులను సమీక్షించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని అదే తన లక్ష్యమన్నారు. ఎక్కడా అలసత్వం, జాప్యం లేకుండా ముద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 

సీతారామ, శ్రీరామసాగర్ పునరుజ్జీవం పథకం పనులు మందకొడిగా జరుగుతుండటంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్క్ ఏజెన్సీలు, సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరం పనులు పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని ఆదేశించారు. అందుకోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ, పంప్‌హౌలను, ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు మంగళవారం, మరో రోజు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం కింద చేపట్టిన పనులను నిర్మాణ ప్రాంతాలను సందర్శించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గంధమల్ల, బస్వాపురం, రిజర్వాయర్ల భూనిర్వాసితులకు చెల్లించడానికి రూ.80 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు.