Asianet News TeluguAsianet News Telugu

మన విద్యార్థులు వైద్య విద్య కోసం విదేశాలకు అవసరం లేదు.. సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌, క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

cm kcr inaugurates Pratima Relief Institute of Medical Sciences and Medical College
Author
First Published Oct 1, 2022, 11:51 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం రోడ్డు మార్గంలో కేసీఆర్ హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకున్నారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ (ప్రతిమ రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌), క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 350 పడకల సామర్థ్యంతో ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించారు. ఇక, ప్రతిమ మెడికల్ కాలేజ్‌లో 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 

అనంతం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులు ఇక్కడ విమర్శిస్తూ.. ఢిల్లీకి వెళ్లి అవార్డులు ఇస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లు ఐదు మాత్రమే ఉండేవని చెప్పారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష వహిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. మనమే 12 కొత్త మెడికల్ కాలేజ్‌లు తెచ్చుకున్నామని అన్నారు. మన విద్యార్థులు వైద్య విద్య కోసం రష్యా, చైనా, ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలోనే వైద్య, విద్య చదివేందుకు సరిపడా సీట్లు ఉన్నాయని చెప్పారు. 

ఇప్పుడు రాష్ట్రంలో మెడికల్ కాలేజ్‌ల సంఖ్య 17కు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 6,500కి పెరిగిందన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజ్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. భారత్ గొప్ప సహనశీల దేశం అని పేర్కొన్నారు. దేశంలో విద్వేషాలకు తావులేదని అన్నారు. విద్వేష రాజకీయాలకు యువత గ్రహించి జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కొద్ది మంది దుర్మార్గులు.. వాళ్ల స్వార్థ‌, నీచ ప్ర‌యోజ‌నాల కోసం విష‌బీజాలు నాటే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని విమర్శించారు. అది ఏ ర‌కంగా కూడా స‌మ‌ర్థ‌నీయం కాదని అన్నారు. 

పురోగతి అనుకున్నట్టుగా సాగాలంటే చైతన్యంగా ఉండాలని కోరారు. కొన్ని సందర్భాల్లో చిన్న అజాగ్రత్త వల్ల తీవ్రంగా నష్టపోతామని అన్నారు. 1956లో చిన్న ఏమరుపాటు వల్ల 60 ఏళ్లు నష్టపోయామని తెలిపారు. ఎన్నో ప్రాణత్యాగాల తర్వాత మళ్లీ తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. ఇప్పుడు విద్వేష రాజకీయాల నుంచి జాగ్రత్తగా ఉండాలని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios