తెలంగాణ మంత్రిమండలి సమావేశం ప్రారంభం అయింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ మంత్రిమండలి సమావేశం ప్రారంభం అయింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. జాతీయ రైతు సంఘాల సమావేశ నిర్ణయాలు, తీర్మానాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

అలాగే.. ఈ ఏడాది సెప్టెంబరు 17తో భారత యూనియన్‌లో తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం) విలీనమై 74 ఏళ్లు పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో వజ్రోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. 

అలాగే.. తెలంగాణ విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరించడం ద్వారా గవర్నర్‌కు విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా అధికారాలను తగ్గించే అంశంపై కూడా కేబినెట్ చర్చించనుంది. ప్రభుత్వానికి తెలియజేయకుండా రాష్ట్రంలో సోదాలు నిర్వహించేందుకు సీబీఐకి ఇచ్చిన ‘‘జనరల్ కన్సెంట్’’ క్లాజును ఉపసంహరించుకుని సీబీఐని తెలంగాణలోకి రానీయకుండా నిర్ణయం తీసుకోవడంపై కేబినెట్‌ సమావేశంలోలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు విధులు నిర్వర్తిస్తున్నారని, విపక్ష పార్టీల నేతలను వేధిస్తున్నారని.. కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. కేబినెట్ భేటీ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ ఎల్పీ సమావేశం జరగనుంది. టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం పార్టీ రాజకీయ వ్యూహాంపై చర్చించే అవకాశం ఉంది. అలాగేమరియు ముందస్తు ఎన్నికలపై చర్చ జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఇక, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల సన్నద్ధం చేసేలా పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ఎంపీలను హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ రద్దుకు సంబంధించి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం కూడా సాగుతుంది.