తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో ఆకస్మికంగా భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎంతో భేటీకి రావాలని ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ నుంచి మంత్రులకు ఫోన్‌లు వెళ్లినట్టుగా తెలుస్తోంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో ఆకస్మికంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎంతో భేటీకి రావాలని ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ నుంచి మంత్రులకు ఫోన్‌లు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అందుబాటులో ఉన్న మంత్రులు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌తో భేటీలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్‌‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పాలనాపరమైన అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. అలాగే నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై కూడా చర్చించే చాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎస్ కూడా సీఎం కేసీఆర్‌తో భేటీకి హాజరుకావడంతో ప్రభుత్వ పరంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా..? అనే చర్చ సాగుతుంది. 

అయితే మరోవైపు ఇటీవల కేసీఆర్‌కు.. ప్రశాంత్ కిషోర్ బృందం పలు అంశాలపై సర్వే రిపోర్ట్‌ను అందజేసిన సంగతి తెలిసిందే. వాటిపై కేసీఆర్ మంత్రులతో చర్చించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా కేసీఆర్ మంత్రులతో ప్రగతిభవన్‌లో సమావేశం కావడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు మాత్రం మంత్రులు అంతా ఎర్రవెల్లికి రావాలని పిలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చిస్తారనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, తెలంగాణలో రాజకీయ పరిణామాలు.. వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది. కేసీఆర్ ఆకస్మిక భేటీ నిర్వహిస్తున్నారంటే.. ఏదో ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక, ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్, మహారాష్ట్రలో ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి, ఖమ్మంలో ఉన్న పువ్వాడ అజయ్.. సీఎంతో భేటీకి హాజరు కావడం లేదు.