కేసీఆర్‌ ఢిల్లీకి వస్తున్నాడని గజగజా వణుకుతున్నారని అందుకే వరదలా హైదరాబాద్‌లో దిగుతున్నారని కేసీఆర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని నడపడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు.

వరద సాయం చేయని వారు.. వరదలా వస్తున్నారని కేసీఆర్ సెటైర్లు వేశారు. వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతా అని ఆయన ప్రశ్నించారు. బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?.

ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి కూడా వస్తున్నారని వాళ్ల పరిస్థితే సక్కగలేదు కానీ వచ్చి మనకు చెబుతారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలను ఎందుకు అమ్ముతున్నారని ఆయన ప్రశ్నించారు.

ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను ఆపలేదని సీఎం గుర్తుచేశారు. అందమైన మూసీనదిని ప్రజెంట్‌ చేసే బాధ్యత నాది.  తపన, సంకల్పం, కార్యాచరణ ఉన్న ప్రభుత్వం మాదని సీఎం కేసీఆర్‌ అన్నారు.

హైదరాబాద్‌ వరదలు చూసి చలించిపోయానని.. లక్షల మంది పేదల బతుకులు ఆగమవడం చూసి బాధపడ్డానన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు సాయం అందజేశామని... డిసెంబర్ 7 తర్వాత వరద సాయం అందని వారికి అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికీ సాయం అందిస్తామని... ప్రధానిని రూ.1300 కోట్ల సాయం అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి ఆరోపించారు. తెలంగాణ భారతదేశంలో లేదా... బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలకు సాయం ఇవ్వలేదా అని ఆయన ప్రశ్నించారు.

వరదసాయం చేయాలని నన్ను ఎవరూ అడగలేదని.. వరదలు వచ్చిన ఏ నగరంలోనూ ప్రభుత్వాలు సాయం చేయలేదన్నారు. ఏ నగరంలోనూ ఇవ్వని విధంగా 6.5లక్షల మందికి 650 కోట్లు ఇచ్చామని... ఈసీకి కంప్లైంట్‌ చేసి కొందరు వరదసాయం బంద్‌ చేయించారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.

మంత్రులంతా మోకాళ్లలోతు నీళ్లలో తిరిగామని... కొందరి కోసం పనిచేసి అందరినీ ఆగం చేయమని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి, గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లతో టీఆర్ఎస్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌కు వెల్లువలా పరిశ్రమలు వస్తున్నాయని... ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్‌ ఉంటాడన్న ఆయన టీపాస్‌ కావాలా?, కర్ఫ్యూ పాస్‌ కావాలో? బిల్డర్లు ఆలోచించుకోవాల్నారు.