తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందినవారే ఒకరిపై ఒకరు భూకబ్జా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ తన రెండెకరాల భూమిని ఆక్రమించుకున్నాడని కాంగ్రెస్ నాయకురాలు రమ్యారావు ఆరోపించారు.

హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ (trs party) నాయకులపై భూఆక్రమణలపై భారీగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల భూములపై కన్నేస్తున్న టీఆర్ఎస్ నాయకులు అధికారుల అండతో ఆక్రమించుకుంటూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) అన్నకూతురే తన భూమి కబ్జాకు గురయ్యిందని ఆరోపించడం సంచలనంగా మారింది. కేసీఆర్ కుటుంబానికే చెందిన ఓ ఎంపీ ఈ భూకబ్జాకు పాల్పడినట్లు ఆరోపించడం మరింత దుమారం రేపింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎలగందులో తాను 2007లో రెండెకరాల భూమి కొనుగోలు చేసినట్లు సీఎం కేసీఆర్ అన్నకూతురు రేగులపాటి రమ్యారావు (regulapati ramyarao) తెలిపారు. ఆ భూమిపై కన్నేసిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ (joginipally santosh kumar) అధికారుల అండతో ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. 

కేవలం తన భూమే కాదు ఇలాగే చాలామంది భూములను ఎంపీ సంతోష్ ఆక్రమించుకున్నారని... ఆయన బాధితులు దాదాపు వందమంది వరకు వుంటారని రమ్యారావు పేర్కొన్నారు. ఎంపీ అక్రమాలపై ఓ నిజనిర్దారణ కమిటీ వేసి పూర్థిస్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించి సంతోష్ పై చర్యలు తీసుకోవాలని రమ్యారావు డిమాండ్ చేసారు. 

ఎంపీ సంతోష్ 2015లో మిడ్ మానేరు ముంపు బాధితుడిగా 2గుంటల భూమిని ప్రభుత్వం నుండి తీసుకున్నాడని రమ్యారావు గుర్తుచేసారు. అలాంటిది ఇప్పుడాయనకు కోకాపేట వంటి ప్రాంతంలో 200 ఎకరాల భూములున్నాయని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలగా అక్రమాలకు పాల్పడుతున్న సంతోష్ వేలకోట్లు సంపాదిస్తున్నారని రమ్యారావు ఆరోపించారు.

2013లో గ్రానైట్ క్వారీలో భాగస్వామ్యం తీసుకున్న నాటినుండి సంతోష్ అక్రమాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఆయన అండదండలతో కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోందని అన్నారు. ఆక్రమించుకున్న తన రెండెకరాల భూమిలో గ్రానైట్ వ్యర్థాలను నింపుతున్నారని రమ్యారావు పేర్కొన్నారు. 

తన భూమిని రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి అక్రమాలకు పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించినట్లు రమ్యారావు తెలిపారు. కానీ అధికార పార్టీకి చెందిన పెద్దలు ఇందులో వుండటంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారని... దీంతో అక్రమార్కులు తిరిగి తమపైనే బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. తమకు వెంటనే న్యాయం చేయాలని... లేదంటే ఎంపీ సంతోష్ భూఅక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తామని రమ్యారావు హెచ్చరించారు.