తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో రక్షణ కోసం విధులు నిర్వహించే ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతడి ఆత్మహత్యతో పోలీస్ శాఖలో కలకలం రేగింది.

వివరాల్లోకి వెళితే...బేగంపేట లోని సీఎం క్యాంపు కార్యాలయంలో పిసిగా ఉపేందర్ విధులు నిర్వహించేవాడు. ఇతడు మీర్ పేట లోని గాయత్రి నగర్ లో నివాసముంటున్నాడు. అయితే వీఐపీలు, ఉన్నతాధికాలరులు ఎక్కువగా వస్తుండే ప్రాంతంలో విధుల్లో ఉండి ఇతడు అలసత్వం ప్రదర్శించడంతో పాటు విధులకు సరిగ్గా హాజరుకావడం లేదన్న కారణంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.  దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఉపేందర్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.