త్వరలోనే అభ్యర్థుల ప్రకటన: ఒకే కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్లపై భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంత కాలం పాటు ప్రజలకు ఏలాంటి పనులు చేయని బీఆర్ఎస్ సర్కార్...పది రోజుల్లో ఏం చేస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
హైదరాబాద్: త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. శుక్రవారంనాడు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక విషయమై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుందన్నారు.సర్వేల ఆధారంగా టిక్కెట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. స్టేట్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీల చర్చల తర్వాత జాతీయ ఎన్నికల కమిటీ అభ్యర్ధులను ప్రకటించనుందన్నారు. ఎన్నికల కమిటీ డిసైడ్ చేసిన వాళ్లే అభ్యర్థులౌతారని ఆయన చెప్పారు.అప్పటి వరకు తామే అభ్యర్థులని ఎవరైనా అనుకుంటే వారి భ్రమే అవుతుందన్నారు.
ఒకే కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్ల కేటాయింపు విషయంలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ ఉన్నప్పటికీ అవసరాల రీత్యా కొందరి విషయంలో పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మైనంపల్లి హన్మంతరావు ఏం ప్రకటించారో తనకు తెలియదన్నారు.
భావసారూప్యత గల పార్టీలతో పొత్తులపై చర్చలు సాగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు.సీట్లు ముఖ్యమా.. ప్రజలు ముఖ్యమా అంటే ప్రజలే ముఖ్యమన్నారు.లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. బీఎస్‌పీతో కూడ చర్చల కోసం ప్రయత్నిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు.
పదేళ్లలో పనిచేయలేని బీఆర్ఎస్ నేతలు... ఈ పది రోజుల్లో ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. మోసంతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు. బీసీ బంధు పేరుతో ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తుందన్నారు. పనిచేసే ముఖ్యమంత్రి కావాలో...ఫాం హౌస్ లో పడుకొనే ముఖ్యమంత్రి కావాలో తేల్చుకోవాలని భట్టి విక్రమార్క కోరారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదకుటుంబానికి ఇళ్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. రాష్ట్రం మనది, సంపద మనది, ప్రజలకు చెందాలన్నారు. రైతు పండించిన ధాన్యానికి ఎంఎస్‌పీ కంటే ఐదు వందలు అదనంగా ఇస్తామని సీఎల్పీ నేత తెలిపారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతు కూలీల అకౌంట్లలో రూ. 12 వేలు జమ చేస్తామని సీఎల్పీ నేత హామీ ఇచ్చారు. తమ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ స్కీమ్ లపై కుట్ర జరుగుతుందన్నారు.