హైదరాబాద్: ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా... తక్షణమే మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాలని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్‌కే పురం నుండి ఆదివారం  ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్  పార్టీ ఎంతో  గౌరవించిందని ఆయన గుర్తు చేశారు. ఐదేళ్లు సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖ, మరో ఐదేళ్లు మైనింగ్ శాఖ మంత్రిత్వశాఖలు ఇచ్చి గౌరవించారన్నారు.

పార్టీ మారిన సబితా ఇంద్రారెడ్డి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే కోర్టును ఆశ్రయించనున్నట్టు విక్రమార్క చెప్పారు. సబితా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. స్పీకర్ స్పందించకపోతే  అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తామన్నారు.

సబితా ఇంద్రారెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయించి తిరిగి మహేశ్వరంలో మధ్యంతర ఎన్నికలు వచ్చేలా తీసుకువస్తామన్నారు.ఓటర్లు సబితా ఇంద్రారెడ్డిపై కేసు పెడతారన్నారు.