ఏడేళ్ల కేసీఆర్ పాలనపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. బుధవారం జూమ్ ద్వారా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఆశించిన ఫలితాలను అందుకోలేదని భట్టి చెప్పారు. కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజలను పూర్తిగా నిరాశా, నిస్పృహలోకి నెట్టేసిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆత్మ గౌరవంతో బతకవచ్చని ప్రజలంతా ఆశించారని.. కానీ చివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మర్యాదను కూడా పొందలేకపోతున్నారని విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులు మంచి చదువులు చదవాలన్న లక్ష్యంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ ఫథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని ఆయన ఆరోపించారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో అమల్లోకి తెచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అరకొరగానే నడుస్తోందని భట్టి చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏడాదికో డీఎస్సీ వేసి ఉద్యోగాలు కల్పించామని.. కానీ కేసీఆర్ పాలనలో ఏడేళ్లువుతున్నా డీఎస్సీ, గ్రూప్ 1 నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి లేదని విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడేళ్లలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు పదవీ విరణ చేస్తే.. ఆ ఖాళీలను సైతం కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదని భట్టి మండిపడ్డారు. ఇక పీఆర్సీ కమిటీ చెప్పిన లక్షా 72 వేల ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేదని ఆయన గుర్తుచేశారు. 

Also Read:మా వద్ద హోంశాఖ లేదు అందుకే బీజేపీలోకి: ఈటలపై జగ్గారెడ్డి కామెంట్స్

ప్రతి నియోజకవర్గంలో లక్ష అదనపు ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. ఒక్క ఎకరాకి నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. దళితులకు ఇస్తామని ఎన్నికల హామీగా చెప్పిన మూడెకరాల భూ పంపిణీ లేదని, మైనారిటీ రిజర్వేషన్ గాలికి వదిలేశారని భట్టి ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అనేది ఒక ఘరానా మోసమని విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రానికి సచివాలయం లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఏడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయలకు కుదవపెట్టారని .. ఈ అప్పులు 2023-24 నాటికి 6 లక్షల కోట్ల రూపాయాలకు చేరుకుంటాయని భట్టి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు భూ దందాల్లో మాత్రమే విజయం సాధించారని అన్నారు. ముత్తిరెడ్డి, మంచిరెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ ఇలా చెప్పకుంటూ పోతే అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలకు అంతే లేదని విక్రమార్క ఆరోపించారు. 

ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుని.. వారిని మంత్రులుగా చేసిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పట్టపగలే న్యాయవాద దంపతులను నడిరోడ్డు మీద హత్య చేస్తే.. ఏమీ చేయలేని దుస్థితిలో శాంతి భద్రతలు వున్నాయని భట్టి చెప్పారు. హుస్సేన్ సాగర్‌ను సుందర జలాశయంగా.. అందులో నీళ్లు కొబ్బరి నీళ్లను తలపించేలా చేస్తానని చెప్పిన మాటలు.. హామీలు ఏమయ్యాయో చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారులను పక్కన పెట్టి ఏపీ కేడర్ కు చెందిన వ్యక్తిని చీఫ్ సెక్రెటరీగా నియమించుకుని మొత్తం బ్యూరోక్రసీని నిస్తేజం చేశారని సీఎల్పీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు ఎవరికి కావాలంటే వారికి కట్టబెట్టుకోవడం.. ఎప్పుడుకావాలంటే అప్పుడు అంచనాలు పెంచుకోవడం.. రాష్ట్ర ధనాన్ని దోచేస్తున్నారని భట్టి ఆరోపించారు. 

పొరుగు రాష్ట్రం నీళ్లను దోచుకుంటుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని భట్టి స్పష్టం చేశారు. సమస్యల నుంచి రక్షణ పొందేందుకే కొందరు బీజేపీలోకి వెళుతున్నారని ఆయన చెప్పారు. ఈటల తనను కలిసినప్పుడు తనకు జరిగిన అవమానంపై అన్ని పార్టీలను కలుస్తానని చెప్పారని భట్టి వెల్లడించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్‌‌కు ఫిర్యాదు చేసినా.. ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు.