తన పేరు చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశ్యంతోనే కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియేట్‌లను కేసీఆర్ నిర్మిస్తున్నారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్. కొత్త భవనాల నిర్మాణం నేపథ్యంలో సోమవారం చలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

పాత సెక్రటేరియేట్‌లో కూలగొడుతున్న భవనాలను పరిశీలించేందుకు వెళుతున్న టీ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని భట్టి తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1985లో ప్రారంభమైన నాటి సెక్రటేరియేట్ భవనం అన్ని వసతులతో ఉందన్నారు.

బిల్డింగ్ నాణ్యతతో, సక్రమంగా ఉందని ఇలాంటి పరిస్ధితుల్లో దీనిని కూల్చడమంటే ఇది తుగ్గక్ చర్యేనని భట్టి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని వాటి సంగతిని ముందుగా చూడాలని కేసీఆర్‌కు సూచించారు.

శాసనసభ ప్రాంగణం రాష్ట్ర ప్రజలందరిదీ అని.. కేసీఆర్‌ కుటుంబసభ్యులకు చెందినది కాదని భట్టి వ్యాఖ్యానించారు. కొత్త భవనానికి సంబంధించి శాసనసభలోని ఫ్లోర్ లీడర్లతో ప్రభుత్వం ఎలాంటి సమావేశం నిర్వహించలేదని విక్రమార్క గుర్తు చేశారు.