టీఆర్ఎస్‌లో విలీనం దిశగా సీఎల్పీ, రంగంలోకి భట్టి: స్పీకర్‌కు ఫిర్యాదు

First Published 23, Apr 2019, 1:57 PM IST
clp leader bhatti vikramarka meets telangana assembly speaker pocharam srinivasreddy
Highlights

కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది.  ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత షబ్బీర్ అలీలు బాన్సువాడలో స్పీకర్ పోచారాం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత షబ్బీర్ అలీలు బాన్సువాడలో స్పీకర్ పోచారాం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా పిటిషన్ ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందంటూ మండిపడ్డారు.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌లో చేరుతున్నామంటూ కొందరు కుట్రలు చేస్తున్నారంటూ ఉత్తమ్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని వారు కుట్ర చేస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ అపహాస్యం చేస్తోందని ధ్వజమెత్తారు.

డబ్బు ఆశ చూపి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. సీఎల్పీని విలీనం చేస్తామని ప్రకటించేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పార్టీ మారుతున్నామని గతంలో ప్రకటించిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశామని, మరో నలుగురు ఎమ్మెల్యేలపైనా మంగళవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఉత్తమ్ తెలిపారు. 

loader