జగ్గారెడ్డి వ్యవహారంపై ఢిల్లీలో అధిష్టానంతో మాట్లాడతానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తుల కోసం కాదు.. పార్టీ కోసం పనిచేయాలని చెప్పినట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో తాను మాట్లాడతానని తెలిపినట్లు వెల్లడించారు. 

జగ్గారెడ్డి (jagga reddy) వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) స్పందించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు సరికాదని.. జగ్గారెడ్డి వ్యవహారంపై ఢిల్లీలో అధిష్టానంతో మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తుల కోసం కాదు.. పార్టీ కోసం పనిచేయాలని చెప్పినట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై స్పందించవద్దని జగ్గారెడ్డికి చెప్పానని ఆయన పేర్కొన్నారు. పార్టీ అంతరంగిక విషయాలు కాబట్టి.. రాహుల్ గాంధీతో (rahul gandhi) తాను మాట్లాడతానని తెలిపినట్లు వెల్లడించారు. 

అంతకుముందు శనివారం ఉదయం నుంచి కూడా పలువురు సీనియర్ నాయకులు జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (uttam kumar reddy) , మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోస్‌ రాజులు జగ్గారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. పార్టీలోపల ఉండి కొట్లాడాలని సూచించారు. పార్టీని వీడొద్దని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు జగ్గారెడ్డి పార్టీని వీడకుండా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. జగ్గారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను కలిసి మాట్లాడారు. జగ్గారెడ్డి ఇంటికి చేరుకున్న పీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్.. కాంగ్రెస్‌ను వీడొద్దని జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేశారు. జగ్గారెడ్డి కాళ్లపై పడి పార్టీ మారొద్దని కిషన్ బతిమిలాడారు.

ఈ సందర్భంగా వీహెచ్ (v hanumantha rao) మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దకు వెళ్దామని జగ్గారెడ్డికి చెప్పారు. పార్టీ నుంచి సీనియర్ నేతలను బయటకు పంపే కుట్ర జరుగుతుందని వీహెచ్ ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పద్దతి బాగోలేదని మండిపడ్డారు. ఒరిజనల్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతుందని.. పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసేందకు ఎంతవరకైనా సిద్దమని చెప్పారు.

ఇకపోతే.. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. తాను ఎవరికీ భయపడేది లేదని.. ఎవరికీ జంకేది లేదన్నారు. తాను స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతానని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలనే లైన్ తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యం కాదని, తాను పార్టీలో వుండి ఎందుకు ఇబ్బంది పడాలి, కాంగ్రెస్‌ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తన తీరువల్ల కొంతమందికి ఇబ్బంది కలగొచ్చని.. అందుకే తాను పార్టీ నుంచి దూరం కావాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే నిక్కచ్చిగా మాట్లాడానని.. జగ్గారెడ్డి వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని, కాంగ్రెస్‌లోని ఒకవర్గం ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. 

జగ్గారెడ్డి పార్టీకి నష్టం చేస్తున్నారనే అపవాదు తనకు ఇష్టం లేదని.. రాహుల్‌పై అసోం సీఎం వ్యాఖ్యల్ని రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ ఖండించారని ఆయన గుర్తుచేశారు. తాను పోవాలని అనుకుంటే ఏ పార్టీలోకైనా వెళ్లగలనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవడం వల్ల తనకు వచ్చిన నష్టమేమి లేదన్నారు. రోజూ ఈ న్యూసెన్స్ పెట్టుకోవడం ఎందుకని తానే వెళ్లిపోతున్నానని జగ్గారెడ్డి చెప్పారు. మూడు , నాలుగు రోజులు టైమ్ తీసుకుని ఆలోచించుకోమని సీనియర్లు చెప్పారని ఆయన వెల్లడించారు. 

తాను మూడు, నాలుగు రోజులు సమయం తీసుకున్నా రాజీనామపై వెనక్కి తగ్గనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సీనియర్లకు వివరించడానికే కొంత సమయం తీసుకుంటున్నానని... ఇవాళే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, కాస్త ఆగానని ఆయన పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే, మంత్రిని, సీఎంను కలిస్తే తప్పా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. బయటివాళ్లు ఎవరైనా విమర్శిస్తే సరే కానీ, సొంతపార్టీ వాళ్లే విమర్శిస్తారా అని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం మంత్రులతో మాట్లాడితే తప్పా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.