హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో  కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతోంది. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొంటామని ప్రకటించడంతో ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం అత్యవసరంగా సమావేశమైంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు, రేగా కాంతారావులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొంటున్నట్టుగా శనివారం నాడు  ప్రకటించారు.ఈ నెల 12వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ  తన అభ్యర్థిగా గూడూరుర నారాయణరెడ్డిని  బరిలోకి దింపింది.

 కాంగ్రెస్ పార్టీకి టీడీపీతో కలుపుకొంటే  గెలుపుకు అవసరమైన బలం సరిపోతోంది. అయితే ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు జై కొట్టారు. ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడ టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించారు.

దీంతో కాంగ్రెస్ పార్టీకి మరో ముగ్గురు ఎమ్మెల్యేల అవసరం అనివార్యంగా మారింది.  ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ మంచిర్యాల జిల్లా టూర్‌ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రద్దు చేసుకొన్నారు. అత్యవసరంగా సీఎల్పీ సమావేశాన్ని ఆదివారం నాడు ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణరెడ్డి, సుధీర్ రెడ్డి, జగ్గారెడ్డి, చిరుమర్తి లింగయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,సీతక్క, పోడెం వీరయ్య హాజరయ్యారు. ఆదివారం నాడు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో సీఎల్పీ అత్యవసరంగా భేటీ హాజరయ్యారు. భవిష్యత్తులో  అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించనున్నారు.