జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ ఏ మాత్రం తగ్గకుండా ఎన్నికల ప్రచారం హోరెత్తితున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.  కాగా.. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేపీహెచ్ బీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది.

కేపీహెచ్‌బీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శుక్రవారం  ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఎదురెదురుగా ర్యాలీలు రావడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. పరస్పరం ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు. పోలీసులు రెండు వర్గాలకు నచ్చజెప్పి పంపించేశారు.

  ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. గ్రేటర్‌లో మెజార్టీ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఎంఐఎం, టీఆర్ఎస్‌లేనన్నారు. ప్రతి ఎన్నికల్లో రోహింగ్యాల ఓట్లతో ఎంఐఎం గెలుస్తుందన్నారు. అక్రమ చొరబాటు దారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కూకట్‌పల్లిలో టీఆర్ఎస్‌ కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తించి.. తన ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించారన్నారు. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.