మద్యం మత్తులో చికెన్ లెగ్ పీస్ కోసం గొడవ పడ్డారు. ఆ గొడవ చివరికి ఒకరిని హత్య చేసుకునే దాకా వెళ్లింది. హత్య చేసిన తర్వాత ఆ శవానికి దహన సంస్కారాలు కూడా వాళ్లే నిర్వహించడం గమనార్హం. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒడిశాలోని సందరంఘడ్ జిల్లా సునాపర్వత్ గ్రామానికి చెందిన బసు జోర, పూజ లుంగీయార్, బీమ్సన్ జోరా, బయా లుంగీయార్ అనే నలుగురు వ్యక్తులు, పెద్దపల్లి మండలం రాఘవాపూర్ లోని ఓ ఇటుక బట్టీలో కూలీలుగా పనిచేస్తున్నారు.

ఈ నెల 9 కోడి లెగ్ పీస్ లు, పేగులు మార్కెట్ నుంచి తెచ్చుకొని వంట చేసుకున్నారు. ఆ రోజు రాత్రి మద్యం సేవిస్తుండగా కోడి కాళ్ల విషయంలో బీమ్సన్ మిగిలిన వారిలో గొడవ పడ్డాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బసు జోర, పూజ లుంగీయార్‌, బయా లుంగీయార్‌ ఓ చెక్క దుంగతో బీమ్సన్‌ తలపై బలంగా కొట్టారు. తీవ్రగాయాలపాలైన బీమ్సన్‌ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో కార్మికులు ఇటుక బట్టీ యజమానులు ఈసారపు శ్రావణ్‌, మేకల మహే్‌షలకు సమాచారం ఇచ్చారు. బీమ్సన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

దీంతో ఇటుక పెళ్లలు పడిపోవడం వలన బీమ్సన్‌ చనిపోయాడన్నట్టుగా ప్రైవేట్‌ ఆస్పత్రి నుంచి మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొచ్చారు. అనంతరం.. కరీంనగర్‌ శ్మశాన వాటికలో మృతదేహాన్ని దహనం చేశారు. ఇందుకు మరో ఇటుక బట్టీ ఓనర్‌ అంబటి సతీష్‌ సహకరించాడు. విషయం బయటికి పొక్కడంతో గీతం శ్రీనివాస్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు  నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.