కొడంగల్‌:  కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో శుక్రవారం నాడు మధ్యాహ్నం కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో  నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కోస్గి మండలంలోని నాగులపల్లి  గ్రామంలో  టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ  చోటు చేసుకొంది.  ఈ ఘటనకు ముందు కోస్గిలో ఈ రెండు పార్టీల మధ్య గొడవ జరిగింది.

పోలీసులు  రెండు వర్గాలను చెదరగొట్టారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన  కార్యకర్తలు  టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగినట్టు తెలిపారు. శ్రీను అనే టీఆర్ఎస్ కార్యకర్త ఇంటిపై శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు దాడులకు పాల్పడ్డారని పోలీసులు  తెలిపారు.

పోలింగ్ స్లిప్లుల విషయమై రెండు పార్టీల  నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకొందని... దీనికి కొనసాగింపుగానే  శుక్రవారం నాడు  దాడి చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.ఈ విషయం తెలిసిన వెంటనే నాగులపల్లి గ్రామానికి  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడి విషయం తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి సోదరుడు గ్రామాన్ని సందర్శించారు. అంతకుముందు పట్నం నరేందర్ రెడ్డి కూడ ఈ గ్రామాన్ని సందర్శించి వెళ్లారు.

ఈ గ్రామంలో సుమారు 1200 ఓట్లు ఉన్నాయి. అయితే ఈ గొడవ జరిగే సమయానికి సుమారు 40 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.