అకాల వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను పరిశీలించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించింది. 

రాష్ట్రంలోని ఆసిఫాబాద్‌, మంచిర్యాల్, నిర్మల్‌, కరీంనగర్‌, జగిత్యాల్‌, భూపాలపల్లి, వరంగల్‌ జిల్లాల్లో అకాల వర్షాల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను, తీసుకుంటున్న, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అంతు కాకుండా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లతో కూడా ఆయన మాట్లాడారు. 

వర్షం తీవ్రత ఎక్కువగా వున్న  కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు, నిర్మల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడ అత్యవసరంగా చేపట్టవలసిన తక్షణ చర్యలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. అవసరమైన టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రైతాంగానికి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.  

కేంద్ర కార్యాలయం అనుమతి లేకుండా అధికారులు ఎవరు జిల్లా కేంద్రాలను వదిలి వెళ్లకూడదని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకు పోకుండా వీలైనంత త్వరగా రైస్‌మిల్లులకు తరలించాలని, ధాన్యం లోడింగ్‌, అన్‌లోడింగ్‌ విషయంలో మిల్లర్లు మరింత వేగంగా స్పందించేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోని అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు అధికారులను ఆదేశించారు.ఖరీఫ్‌లో ఇప్పటివరకు దాదాపు 29.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 29.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించడం జరిగిందని పైరసరఫరా అధికారులు తెలిపారు.