చిలుకూరు బాలాజీ ఆలయంలో ఈ నెల 12న గరుడప్రసాదం ఇవ్వబడుతుందని చిలుకూరు పూజారులు తెలిపారు. చిలుకూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేరోజు ఇది ఇస్తామని.. సంతానంకోసం తపించే స్త్రీలు ఈ ప్రసాదాన్ని పొందాలని కోరారు.
హైదరాబాద్ : చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి, శ్రీరామనవమి అనంతరం రెండవ రోజు లాంఛనప్రాయంగా చిలుకూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే రోజు ధ్వజారోహణకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ధ్వజంపై గరుడ పటాన్ని ఎక్కించిన తరువాత, ధ్వజస్తంభం క్రింద ఉన్న గరుత్మంతుని విగ్రహానికి అభిషేకం చేస్తాం. గరుత్మంతుని ఆరాధన అలంకారం తర్వాత, ధ్వజారోహణం సమయంలో నాలుగు దిక్కుల ఉన్న గరుత్మంతులవారికి పొంగలి నైవేద్యం ఇస్తాం. దీన్ని గరుడపిండం లేక గరుత్మంతుని నైవేద్యం అని పిలుస్తారు.
"
యాస్త్రీ పిండం అశ్నాతి తాస్త్రీ పుత్రవతీ భవేత్...
ఏ స్త్రీ ఈ గరుడపిండాన్నిప్రసాదంగా భావించి తింటుందో, ఆ స్త్రీ సంతానవతి అవుతుంది.. అని ఆగమ శ్లోకం. కొన్ని సంవత్సరాల క్రితం, ఈ విషయాన్ని మెల్లగా ఆలయంలో వచ్చిన కొందరికి చెప్పాం. అప్పట్లో ప్రసాదం తీసుకున్న భక్తులు తక్కువ సంఖ్యలో.. అంటే బహుశా ఏక సంఖ్యలో ఉన్నారు.ప్రసాదం అత్యంత శక్తివంతమైనది కావున,దాన్ని తీసుకున్న వారంతా దాదాపు గర్భవతులైనారు. అలా ఆ నోటా ఈ నోటా విని ఇప్పుడు కొన్ని వేల మంది ప్రత్యేక ప్రసాదం స్వీకరించిన వారికి సంతాన భాగ్యం కలిగింది.
2019 సంవత్సరం కొన్ని వేలమంది భక్తులు ఈ ప్రసాదాన్ని తీసుకున్నారు. వారిలో చాలామంది ఇప్పుడు ఆలయానికి పిల్లల నెత్తుకొని వచ్చి, ఈ పాప/బాబు గరుడ ప్రసాద ఫలితమని మాకు చెప్తున్నారు. 2020, 2021 సంవత్సరాలలో covid 19 కారణంగా ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించాం. ఈసారి వైభవోపేతంగా జరపాలి అని నిర్ణయించడం వల్ల భక్తులకు ఈ ఆహ్వానం పలుకుతున్నాం.
గరుత్మంతుని మహిమ
మూడు సంవత్సరాల క్రితం, ఒక యువతి చిలుకూరు ఆలయానికి వచ్చింది. ఆమె గత ఆరు సంవత్సరాల నుండి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నదట. ఆమె గర్భసంచి ఉండవలసిన చోటు కాకుండా కొంచం ప్రక్కన ఉన్న కారణాన పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చి చెప్పారని భాదతో నాకు చెప్పింది. వైద్యుడు దేవునితో సమానమే కాని దేవుడు కాడని చెప్పాను. వారికి వైద్య శాస్త్ర జ్ఞానం అపారంగా ఉన్నమాట నిజమే అయినా, దేవుడు వైద్య శాస్త్రానికి అతీతుడు, ఆయన కరుణ , కటాక్షాలు ఉంటే అసాధ్యాలన్నీ సుసాధ్యాలే అని అనునయంగా పలికాను.
మా మాట ప్రకారం ఆ స్త్రీ గరుడ ప్రసాదాన్ని భక్తితో స్వీకరించింది. ఆమె గర్భం దాల్చింది. ఈసారి వైద్యులు ఆమె గర్భాన్ని కొనసాగించినట్లైతే ఆమె కే ప్రాణహాని కలుగుతుందని, కావున గర్భ విచ్ఛిత్తి చెయ్యాలని చెప్పారు. ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఒక ప్రక్కన గర్భధారణ జరగడం అసాధ్యం అన్నప్పుడు ఆమె గర్భవతైనది. ఆ స్వామి ఆశీర్వాదం లోపల ఊపిరి పోసుకుంటే, దాన్ని విచ్ఛిన్నం చెయ్యమంటున్నారు. ఎందుకైనా మంచిదని ఆ యువతిని ఇంకొక వైద్యురాలిని సంప్రదించమన్నాం. ఆమె ఒక సీనియరు గైనకాలజిస్టు దగ్గరికి వెళ్ళిందిట. ఈ వైద్యురాలు ఆమెను పరీక్షించి కొన్ని జాగ్రత్తలు చెప్పి, గర్భస్థ శిశువును తల్లిని తన కనుసన్నలలో పెట్టుకుని కాపాడింది. వైద్యురాలి పర్యవేక్షణ ఫలితంగా 10 నెలల తరువాత ఆ భక్తురాలు పండంటి బాబుని ప్రసవించింది.
ఆ స్త్రీ ఆపుకోలేని ఆనందంతో బాబుని చిలుకూరు ఆలయానికి తీసుకుని వచ్చి, అక్కడున్న భక్తులందరికీ బత్తాయి పండ్లను పంచి తన బాబుని అందరికీ చూపించింది. భక్తులంతా ఆమె సంతోషాన్ని పంచుకున్నారు. తన అనుభవాన్ని మైకులో చెప్పమని ఆ యువతి నన్ను అడిగింది.
ఈ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరం...ఏప్రిల్ 2022 మాసంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 12వ తేదీనాడు ధ్వజారోహణము. ఆ రోజు భక్తులందరికీ గరుడ ప్రసాదం ఇవ్వబడుతుంది. భక్తులందరూ ఆ రోజు ఉదయం 8.30 గం.లకు వచ్చి పూజానంతరం ఇవ్వబడే గరుడ ప్రసాదాన్ని స్వీకరించవచ్చును. ప్రసాదం కోసం వచ్చే స్త్రీలు ఉ.8.30 కల్లా గుడిలో ఉండాలి. విజ్ఞాన శాస్త్రానికి అతీతంగా ఒక శక్తి ఉందని, ఆ శక్తి మహిమలు కేవలం అనుభవించిన వారికే తెలుస్తాయి. తప్ప ఎంత చెప్పినా అర్థం కావు. వాటిని ఋజువు చెయ్యమని నమ్మే వైద్యుల కోసమే నా ఈ చిన్న ప్రయత్నం.
