దొంగతనం చేశారని అమానుషానికి ఒడి గట్టాడో దుకాణం యజమాని, చిన్నారులని కూడా చూడకుండా గుంజకు కట్టేసి బాధించాడు. ఆ తరువాత తల్లిదండ్రులకు అప్పగించాడు. 

ఈ ఘటన వివరాల్లోకి వెడితే..జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం మద్దులపల్లిలో కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డారంటూ నలుగురు చిన్నారులను దుకాణం యజమాని గుంజలకు కట్టేశాడు. 

నలుగురు పిల్లలు తన దుకాణంలో నగదు చోరీ చేస్తున్నట్లు గుర్తించిన యజమాని మంగళవారం రెడ్‌ హ్యాండెడ్‌గా చిన్నారుల్ని పట్టుకున్నాడు. నయానో, భయానో బెదిరించి వదిలేయక వారి పట్ల అమానుషంగా వ్యవహరించాడు. 

తన దుకాణం ముందు పందిరి గుంజలకు చిన్నారులను తాడుతో కట్టేసి, కొద్దిసేపయ్యాక పిల్లల తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పి అప్పగించాడు. దీన్ని కొందరు స్థానికులు వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.