హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ వరాలు కురిపించిన విషయం తెలిసిందే. 30శాతం పీఆర్సీతో పాటు రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు తదితర నిర్ణయాలతో ఆనందం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు కేసీర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. సీఎం నిర్ణయం ఎవరికి ఎంత ఉపయోగపడ్డాయో తెలీదు కానీ చీకట్లు కమ్ముకున్న ఓ చిన్నారి కుటుంబంలో వెలుగులు మాత్రం నింపాయి. దీంతో ఆ చిన్నారి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసింది. 

వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అన్న‌పు‌రెడ్డిపల్లికి చెందిన  సునీత, రాము దంపతులు. కూతురు లిఖితతో కలిసి ఈ కుటుంబం ఆనందంగా జీవించేది. రాము డీఎస్సీ 2008 ద్వారా సీపీ‌ఎస్‌ ఉద్యోగిగా నియ‌మి‌తు‌లయ్యారు. మంచి ఉద్యోగం లభించడంతో ఆనందంగా సాగుతున్న ఈ కుటుంబంలో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. 2018 జనవరిలో రోడ్డు ప్రమా‌దానికి గురయిన రాము  మర‌ణించారు. సంపా‌దించే వ్యక్తి దూర‌మ‌వడం,  సీపీ‌ఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌ సదు‌పాయం లేక‌పో‌వ‌డంతో ఆ కుటుంబం రెండేం‌డ్లుగా వేదన అను‌భ‌వి‌స్తోంది. 

ఇలా ఆ కుటుంబం ఆర్థి‌కంగా కుదే‌లయ్యింది. ఈ ప్రభావం కుటుంబంపైనే కాదు లిఖిత చదు‌వుపై పడింది. అయితే నిన్న(సోమవారం) సీపీ‌ఎస్‌ ఉద్యో‌గు‌లకు ఫ్యామిలీ పెన్షన్‌ అంది‌స్తా‌మని సీఎం కేసీ‌ఆర్‌ చేసిన ప్రక‌టన ఆ కుటుం‌బంలో సంతోషం నింపింది. సీఎం నిర్ణ‌యంపై హర్షం వ్యక్తం చేస్తూ... లేఖిత సీఎం కేసీ‌ఆర్‌ చిత్ర‌ప‌టా‌నికి క్షీరా‌భి‌షేకం చేసింది. చీకట్లు నిండిన తమ జీవి‌తంలో ఇదొక కొత్త వెలుగు అని రాము భార్య సునీత సంతోషం వ్యక్తం‌చే‌శారు.