ఉప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ కుటుంబాన్ని వేగంగా వచ్చిన ఆటో ఢీకొనడంతో ఓ చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. రామాంతపూర్‌కు చెందిన ఉమేశ్ తన భార్యా, పిల్లలతో కలిసి నిన్న షాపింగ్‌కు బయలుదేరాడు.

కుమారుడు మోహిత్‌తో కలిసి ఉమేశ్ ముందు నడుస్తుండగా.. భార్య, రెండో కుమారుడు వెనుక నడుస్తున్నారు. సరదాగా కొడుకు చెబుతున్న మాటలు వింటున్న తండ్రిని ఎదురుగా వేగంగా వస్తున్న ఆటో వచ్చి ఢీకొట్టింది. బైక్‌ను తప్పించే క్రమంలో ఆటో డ్రైవర్ వాహనాన్ని పక్కకు తిప్పడంతో ఆటో వీరిపైకి దూసుకొచ్చింది.

ఆటో ఒక పక్కకు ఒరిగిపోతూ.. ఉమేశ్, మోహిత్‌లను ఢీకొట్టడంతో.. ఉమేశ్ పక్కకు ఎగిరిపడగా.. ఫుట్‌పాత్‌కు, ఆటోకి మధ్య మోహిత్ నలిగిపోతూ.. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. అప్పటి వరకు తనకు కబుర్లు చెప్పిన కొడుకు రెప్పపాటులో నిర్జీవంగా పడివుండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.