కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో... జనాలు చికెన్ తినడానికే భయపడిపోయారు. చికెన్ తినడం వల్లే కరోనా వస్తోందనే భ్రమలో మాంసాహారం వైపే చూడలేదు. చాలా ప్రాంతాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. చాలా మంది ఉచితంగా కూడా పంపిణీ చేశారు. అయితే.. లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

Also Read ఏప్రిల్ 7లోగా తెలంగాణ కరోనా ఫ్రీ: గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్...

తెలంగాణ రాష్ట్రంలో చికెన్‌, మటన్‌ ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు ఏకంగా ఎన్నడూ లేనంత రేట్లకు అమ్మారు. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై మాంసాహార వంటకాలు ఎక్కువగా చేస్తుండటంతో ఇప్పటికే వినియోగం పెరిగింది. దీనికితోడు ‘కరోనా ప్రబలేందుకు.. చికెన్‌, మటన్‌, చేపలు, గుడ్లు ఏవీ కారణం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి మరింత పెరగాలంటే వాటిని ఎక్కువగా తినాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రకటించడంతో అపోహలు తొలగాయి. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచుతున్నారు.

హైదరాబాద్‌లో ఇటీవలి వరకు కిలో మటన్‌ రూ.680 నుంచి రూ.700 మధ్య ఉండగా.. ఆదివారం రూ.800 అయింది. రామంతాపూర్‌, ఉప్పల్‌, మేడిపల్లి, హయత్‌నగర్‌, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, కొండాపూర్‌, మణికొండ, ఎల్బీనగర్‌ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆ పైనే విక్రయించారు. ఫిబ్రవరిలో కిలో మటన్‌ రూ.580 మాత్రమే కావడం గమనార్హం.