హైదరాబాద్: చేవెళ్ల మండలం తంగేడుపల్లి గ్రామ సమీపంలోని వంతెన కింద నగ్నంగా పడి ఉన్న మహిళ మృతదేహం కేసు మిస్టరీ వీడింది. దిశ ఘటన తర్వాత ఈ కేసు అంతగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మృతురాలిది సిక్కిం రాష్ట్రమని సైబరాబాదు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె ప్రియుడే ఆ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. 

మహిళ హత్యకు నిందితుడి బంధువు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ, సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మృతదేహాన్ని పారేసేందుకు వాడిన అద్దె కారను పోలీసులు గుర్తించారు. 

ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ప్రధాన నిందితుడిని గుర్తించారు. మృతురాలికి పిల్లలు, భర్త ఉన్నారు. నిందితుడు ఫేస్ బుక్ ద్వారా మహిళకు పరిచయమయ్యాడని, అది వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు చెబుతున్నారు. వారిద్దరి మధ్య గొడవనే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

నిందితులు మృతదేహాన్ని పారేసేందుకు కారును అద్దెకు తీసుకున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత తంగేడుపల్లి వద్ద వంతెనపై నుంచి నైలాన్ తాడుతో మృతదేహాన్ని దించారు. తలను బండరాయితో మోడీ దుస్తులను అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు బంగారు ఆభరణాలను వదిలి వెళ్లినట్లు భావిస్తున్నారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. మహిళ అదృశ్యమైనట్లు సిక్కింలో కేసు నమోదైంది.