బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌పై చీటింగ్, ఫోర్జరీ కేసు
బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. భూ కబ్జాకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
Joginipally Santhosh Kumar: బీఆర్ఎస్ మాజీ ఎంపీ, కేసీఆర్ మేనల్లుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదైంది. ఓ భూ వ్యవహారానికి సంబంధించి సంతోష్ కుమార్ పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో హైదరాబాద్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. నవయుగ ఇంజినీరింగ్ కంపనీ లిమిటెడ్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు ఫైల్ అయింది.
తమ కంపెనీకి చెందిన భూమిలోకి సంతోష్ కుమార్ అక్రమంగా ప్రవేశించాడని నవయుగ కంపెనీ ఆరోపించింది. బంజారా హిల్స్‌లోని తమ కంపెనీకి చెందిన భూమిలో సంతోష్ కుమార్ కుట్రపూరితంగా ప్రవేశించి, భూమి కాజేయాలని ప్రయత్నించాడని ఆరోపణలు చేసింది.
కంపెనీకి చెందిన ఓ ప్రతినిది ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, బంజారాహిల్స్‌లోని 1,350 స్క్వేర్ యార్డుల భూమిని 2010లో ఈ కంపెనీ కొనుగోలు చేసింది. అయితే, ఇటీవలే ఆ భూమిలో రెండు గదులను నిర్మించినట్టు తమకు తెలిసిందని ఆ ప్రతినిధి పేర్కొన్నాడు. జీహెచ్ఎంసీలో ఆరా తీయగా.. తమ కంపెనీకి చెందిన భూమిపై నిర్మించిన ఆ రెండు గదులకు తప్పుడు డోర్ నెంబర్లు వేసి పన్నులు సంతోష్ కుమార్, లింగా శ్రీధర్ రెడ్డి కడుతున్నట్టు తెలిసిందని వివరించాడు.
తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన వారు భూమిని లాక్కోవడానికి ఫోర్జరీ చేశారని, నకిలీ పత్రాలు సృష్టించారని ఆ కంపెనీ ప్రతినిధి తన ఫిర్యాదులో ధ్రువీకరించాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంతోష్ కుమార్, లింగారెడ్డిలపై దర్యాప్తు మొదలు పెట్టారు.