హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. ఈ కేసులో గురువారంనాడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ లో చంద్రబాబుపై ఏ విధమైన అభియోగాలు కూడా మోపలేదు. 

ఏసీబీ చార్జిషీట్ లో ఉన్నవారి పేర్లనే ఈడి తన చార్జిషీట్ లో పొందుపరిచింది. ప్రస్తుత కాంగ్రెసు ఎంపీ రేవంత్ రెడ్డిని మొదటి ముద్దాయిగా ఈడీ చేర్చింది. ఈ మేరకు నాంపల్లిలనని మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కమ్ పీఎంఎఫ్ఎల్ఏ ప్రత్యేక కోర్టులో ఈడీ చార్జీషీట్ దాఖలు చేసింది..ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బిషప్ సెబాస్టియన్ హ్యారీ, రుద్ర శివకుమార్ ఉదయసింహ, మత్తయ్య జెరూసలేం, కృష్ణ కీర్తన్ లపై ఈడీ అభియోగాలు మోపింది. 

కాగా, ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సాక్షులందరి చీఫ్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాతనే క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విజ్ఞప్తిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారంనాడు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. 

అందరి చీఫ్ ఎగ్జామినేషన్ పూర్తి కాక ముందే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే మిగతా సాక్షులు అప్రమత్తమయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో అభిప్రాయపడ్డారు ఈ కేసులో దర్యాప్తు అధికారులైన శ్రీకాంత్. వై మల్లికార్జున్ రెడ్డి, జె. అశోక్ కుమార్, జి కపూర్ ల చీఫ్ ఎగ్జామినేషన్ తర్వాతనే క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టే విధంగా ఆదేశాలివ్వాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 2015 జూన్ 1వ తేదీన జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయాలని లేదా ఓటింగుకు దూరంగా ఉండాలని సూచిస్తూ అలా చేసినందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు  ఇస్తూ రేవంత్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు