మే మొదటి వారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వరంగల్‌లో భారీ ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 

వరంగల్‌లో (warangal) కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. వరంగల్‌లో ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మే 6న మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి వరంగల్‌కు హెలికాఫ్టర్‌లో వస్తారు రాహుల్ గాంధీ. కాకతీయ యూనివర్సిటీకి చేరుకుని ... అక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ వరకు రాహుల్ గాంధీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఓపెన్ టాప్ వ్యానులో రాహుల్ ర్యాలీ చేపడతారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు రాహుల్ బహిరంగ సభ వుంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 

ఈ సభకు రైతు సంఘర్షణ సభగా నామకరణం చేశారు కాంగ్రెస్ నేతలు. ఓరుగల్లు సభతో రాష్ట్ర రాజకీయాల్లో వైబ్రేషన్స్‌ ఖాయమని చెబుతున్నారు టీపీసీసీ నేతలు. మరోవైపు ఇప్పట్నుంచే రాహుల్‌ సభ కోసం సన్నాహాలు చేస్తున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలు.. బహిరంగ సభా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా రైతులు ఈ బహిరంగ సభకు తరలివస్తారనే అంచనాతో ఉన్న కాంగ్రెస్.. దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పడింది.

టీపీసీసీ (tpcc) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) తో పాటు ముఖ్య నేతలంతా ఈ పనిలోనే తలమునకలై ఉన్నారు. రాహుల్ సభ విజయవంతానికి క్షేత్ర స్థాయిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komatireddy venkat reddy) , ప్రచార కమిటీ ఛైర్మెన్ మధు యాష్కీ (madhu yashki) వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో సభా స్థలి పరిశీలనతో పాటు జిల్లా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

కాగా.. 2023 లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ (trs) ను గద్దె దించడం కోసం అవసరమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తుంది. అయితే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ రేసులో ముందుకు వచ్చింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బీజేపీ (bjp) నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా ఉందని నిరూపించిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు గంప గుత్తగా షిఫ్ట్ కానుంది.