Asianet News TeluguAsianet News Telugu

మాకు 16 ఎంపీ సీట్లు ఇవ్వమన్నది ఎందుకో ఇప్పుడు అర్థమవుతోందా..!! : కేటీఆర్ 

16 ఎంపీ సీట్లిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామంటే ఎగతాళి చేసారు... కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం 16 సీట్లతోనే ఆ పని చేస్తున్నారని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

Chandrababu Stopped Vizag Steel Plant Privatisation With 16 MP Seats : BRS Working President KTR AKP
Author
First Published Jun 20, 2024, 8:52 PM IST | Last Updated Jun 20, 2024, 9:19 PM IST

హైదరాబాద్ : గతంలో సారు... కారు.. పదహారు అంటూ లోక్ సభ ఎన్నికలకు వెళ్లింది భారత రాష్ట్ర సమితి. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లోనూ ఒక్కసీటు గెలిచే అవకాశం లేకున్నా 16 ఎంపీ సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ బిఆర్ఎస్ 16 సీట్లలో గెలుస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే ప్రత్యర్థి పార్టీలు ఎగతాలి చేసాయి. తమకు 16 సీట్లిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని... కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో బిఆర్ఎస్ కీలకంగా మారుతుందన్న కేసీఆర్ కామెంట్స్ పై తెగ ట్రోలింగ్ జరిగింది. 

అయితే కేసీఆర్ అన్నట్లుగానే జరిగింది... కానీ బిఆర్ఎస్ కాదు టిడిపి 16 సీట్లతో కేంద్రంలో చక్రం తిప్పుతోంది. బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సరిపడా మెజారిటీ లేకపోవడంతో ఎన్డిఏలోని మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో టిడిపి గెలిచిన 16 సీట్లు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకమయ్యాయి. ఇలా బిఆర్ఎస్ అధినేత అన్నట్లు 16 సీట్లతోనూ కేంద్రంలో చక్కం తిప్పొచ్చని నిరూపితమయ్యింది.    

తాజాగా మాజీమంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బిఆర్ఎస్ 16 సీట్లలో గెలిపించమని ఎందుకు అడిగిందో అర్థమయ్యిందా..? అని ప్రశ్నించేలా ఆసక్తికర కామెంట్స్ చేసారు. కేంద్ర ప్రభుత్వం రేపు(శుక్రవారం) హైదరాబాద్ లో నిర్వహించనున్న బొగ్గుగనుల వేలంపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణ  కొంగుబంగారం సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని...  ఈ సమయంలో బిఆర్ఎస్ కు ఎంపీల బలం వుండివుంటే కేసీఆర్ అడ్డుకునేవారని కేటీఆర్ అన్నారు. 16 మంది ఎంపీలతో టిడిపి కేంద్రంలో చక్రం తిప్పుతోందని... బిఆర్ఎస్ ను కూడా అలా గెలిపిస్తే తెలంగాణకు మేలు జరిగేదన్నారు. 

చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని శాసించేస్థాయిలో వున్నారు... అందుకు ఆయన 16 ఎంపీ సీట్లే కారణం. దీంతో గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలనుకున్న కేంద్రం వెనక్కి తగ్గిందని కేటీఆర్ అన్నారు. ఇలా చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నట్లే బిఆర్ఎస్ కు కూడా 16మంది ఎంపీలు వుండివుంటే సింగరేణిని ప్రైవేటీకరణను అడ్డుకునేదన్నారు. తెలంగాణ ప్రజలు బిజెపికి 8, కాంగ్రెస్ కు 8 ఎంపీ సీట్లు ఇస్తే వారు సింగరేణిని ఖతం చేయడానికి సిద్దమయ్యారంటూ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేసారు. 

తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ మాత్రమే రక్షణ కవచమని కేసీఆర్ వేలసార్లు చెప్పారు... ఇప్పుడు అదే నిజమని నిరూపితం అవుతోందని కేటీఆర్ అన్నారు. మాకు 16 సీట్లు ఇవ్వండి... కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటామని కేసీఆర్ చెబితే సీఎం రేవంత్ ఎగతాళిగా మాట్లాడారని కేటీఆర్ గుర్తుచేసారు. కానీ 9మంది ఎంపీలు వున్నపుడే కేసీఆర్ సింగరేణి బొగ్గుగనుల వేలంపాటను అడ్డుకున్నారని అన్నారు.గతంలోనే వేలం పాట ద్వారా గనులు కేటాయించవద్దని కేసీఆర్ కేంద్రానికి ఉత్తరం రాశారని కేటీఆర్ గుర్తుచేసారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కూడా నష్టాల్లో ఉందంటూ ప్రైవేటీకరణకు సిద్దమయ్యారని కేటీఆర్ గుర్తుచేసారు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ గని లేకుండా నష్టపోయేలా చేసిందే కేంద్ర ప్రభుత్వమని అన్నారు. సేమ్ ఇలాగే సింగరేణి ప్రైవేటీకరణకు కుట్రలు పన్నుతున్నారని...   ఇందులో భాగంగానే బొగ్గుగనుల వేలంపాట చేపడుతున్నారని అన్నారు. గత పదేళ్లు మెడమీద కత్తిపెట్టినా సింగరేణిని ప్రైవేటీకరించే చర్యలను ముందుకు సాగనివ్వలేమని కేటీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కోల్ బ్లాక్ ల వేలానికి మద్దతిస్తూ సింగరేణిని ఖతం చేసేందుకు సహకరిస్తోందని ఆరోపించారు. అసలు వేలంపాటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు  పాల్గొంటుందో చెప్పాలని కేటీఆర్ నిలదీసారు. 

లోక్ సభ లో బీఆర్ఎస్ లేకపోవటంతోనే సింగరేణిని ఖతం పట్టించే ప్రయత్నాలు అడ్డూఅదుపు లేకుండా జరుగుతున్నాయని అన్నారు. బిజేపీకి రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు ఇస్తే...వాళ్లు ప్రజలకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అన్నారు. బిజేపీ నిర్ణయానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎందుకు వంత పాడుతున్నారు? వేలంలో డిప్యూటీ సీఎం ఎందుకు పాల్గొనబోతున్నారో చెప్పాలన్నారు. వేలంపాటలో పాల్గొనడం అంటేనే దాన్ని ప్రైవేటీకరణ చేసే పనిని అంగీకరిస్తున్నట్లేనని కేటీఆర్ అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios