తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఓడించేందుకు మహాకూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా.. ఒక వేళ ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థి ఎవరు, ఏ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.

కాగా.. ఈ విషయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. కూటమి గెలిస్తే...కాంగ్రెస్ అభ్యర్థే ముఖ్యమంత్రి పదవి చేపడతారని స్పష్టం చేశారు.

అనంతరం కేసీఆర్ పై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ అబద్దాల కోరు అంటూ విమర్శించారు. నోరు పారేసుకోవడం కేసీఆర్, మోదీలకు ముందు నుంచీ అలవాటేనని అన్నారు.  రాజకీయాల్లో హుందాతనం ఉండాలని హితవు పలికారు. నోట్ల రద్దు, జీఎస్టీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.

మోదీ కారణంగా దేశ ప్రజలంతా అభద్రతా భావంతో ఉన్నారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక... తెలంగాణలో అభివృద్ధి కుంటిపడిపోయిందని ఆరోపించారు.